AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఢిల్లీలోనే రాజేందర్‌, రాజగోపాల్‌రెడ్డి

ముఖ్యనేతలతో సమావేశం కోసమా? ఇంకేమైనానా..
బీజేపీ జాతీయ అధ్యక్షులు జయత్‌ ప్రకాశ్‌ నడ్డా రాష్ట్ర పర్యటనకొచ్చారు. ఆ పార్టీ చేరికల కమిటీ చైర్మెన్‌ ఈటల రాజేందర్‌, మాజీ ఎంపీ రాజగోపాల్‌రెడ్డి మాత్రం ఢిల్లీలోనే ఉండిపోయారు. జాతీయ పార్టీ అధ్యక్షులు రాష్ట్రానికి వస్తున్నారంటే ఎంత పనున్నా నేతలు వారి వెంట ఉండేందుకో, సభలో పాల్గొనేందుకో ఆసక్తి చూపుతారు. సోమ, మంగళవారాల్లో అమిత్‌షాతో భేటీ ఉందనుకున్నా ఢిల్లీ నుంచి వచ్చి సభలో పాల్గొని పోవడం ఈటలకు అసాధ్యమేమీ కాదు. ఆయన వచ్చి ఉంటే నేతల మధ్య అధిష్టానం సయోధ్య కుదిర్చింది…పార్టీలో నేతలు ఐక్యంగా ఉన్నారు అనే భావన కాస్తయినా ఆ పార్టీ శ్రేణుల్లోకి వెళ్లేది. కానీ, అలా జరగలేదు. ‘పార్టీ మారేటోళ్లను మేం ఆపబోం’ అని బండి అంటే…ఈటల రాజేందర్‌, రాజగోపాల్‌రెడ్డిలు ‘మొహమాటాలు లేవు. మేం చెప్పాల్సిదంతా అధిష్టానానికి చెబుతాం. రాష్ట్రంలో ఎలాగైతే ముందుకెళ్తామనే విషయంలో మా అభిప్రాయాన్ని స్పష్టంగా చెబుతాం’ అని చెప్పారు.

పార్టీలో బేదాభిప్రాయాలను పక్కనబెట్టి ముందుకెళ్తామని చెప్పకుండా.. ఎవరికి వారు ”మేం” అని పేర్కొనడమే వారి మధ్య ఉన్న అంతర్గత విబేధాలను ఎత్తిచూపుతున్నది. రెండు రోజులుగా జరుగుతున్న ప్రెస్‌మీట్ల సారాంశాన్ని చూస్తే బీజేపీ తెలంగాణ శాఖలో ఏదో జరగరానిది జరుగుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈటల, కోమటిరెడ్డిలిద్దరూ ముఖ్య నేతలతో సమావేశం కోసమే ఆగియాపోయారా? కావాలనే డుమ్మా కొట్టారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు రాజకీయంగా ఇదే చర్చనీయాంశం అవుతున్నది. ఇప్పటికే వారిద్దరూ రాష్ట్ర బీజేపీలో చేయాల్సిన మార్పుల విషయంపై అధిష్టానం వద్ద కుండ బద్దలు కొట్టి చెప్పినట్టు ప్రచారం సాగుతున్నది.

మద్యం కుంభ కోణం విషయంలో కవితను అరెస్టు చేయకపోవడం వల్ల బీజేపీ-బీఆర్‌ఎస్‌ లాలూచీ పడ్డాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అధిష్టానం ఇంకా స్తబ్దుగా ఉండటం సబబు కాదనీ, ఇలాగైతే తెలంగాణలో పార్టీ ముందుకెళ్లడం కష్టమని వారు స్పష్టం చేసినట్టు తెలిసింది. అయితే, జేపీ నడ్డాతో జరిగిన సమావేశంలో వారికి ఏ విషయంపైనా స్పష్టమైన హామీ రాలేదనీ, ఈ నేపథ్యంలో బీజేపీలో నెంబర్‌ 2 నేతగా చలామణీ అవుతున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాతో పాటు, మరికొందరు నేతలతో సమావేశం అయ్యేందుకే వారు ఢిల్లీలో ఉన్నారని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి.

ANN TOP 10