బీచ్‌లో ఈత కొడుతు మునిగిపోతున్న ఇద్దరు పిల్లలను ఒక పోలీస్ కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించి కాపాడాడు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం సాయంత్రం పదేళ్లు, ఏడేళ్ల వయసున్న ఇద్దరు బాలురు ఈత కోసం జూహు బీచ్‌లోకి దిగారు. అయితే అలల తాకిడికి వారిద్దరూ సముద్రం లోపలకు వెళ్లిపోయారు. ఒడ్డుకు రాలేక, ఈత కొట్టలేక మునిగిపోతుండగా అక్కడే ఉన్న శాంతాక్రూజ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ విష్ణు భౌరావ్ బేలే గమనించాడు. వెంటనే ఆలస్యం చేయకుండా సముద్రంలోకి దిగాడు. ఇద్దరు పిల్లలను రక్షించాడు. వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు. ఒడ్డు వద్ద ఉన్న తల్లిదండ్రులకు ఆ పిల్లలను అప్పగించాడు. ఈ ఘటనకు సంభందించిన వీడియోను ముంబై పోలీసులు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. పిల్లలను కాపాడిన పోలీస్ కానిస్టేబుల్ చొరవ, ధైర్యసాహసాలను పలువురు నెటిజన్లు ప్రశంసించారు.
