– శిలాఫలకంపై అమరుల పేర్లు లేకపోవడం దారుణం : రేవంత్‌రెడ్డి
అమర వీరుల స్మారకంలోనూ బీఆర్‌ఎస్ అవినీతికి పాల్పడిందని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. నిర్మాణంలోనూ నాణ్యతా లోపాలు ఉన్నాయని చెప్పారు. గాంధీభవన్‌లో పార్టీ నేతలతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. అమరవీరుల స్మారక నిర్మాణ పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. అంచనా వ్యయాన్ని ఇష్టానుసారంగా పెంచారని తెలిపారు. అందులో మంత్రి కేటీఆర్ పాత్ర ఉందని ఆరోపించారు. తెలంగాణ అమరుల స్మారకం చూడగానే వారి పోరాటాలు, త్యాగాలను గుర్తుకురావాలన్నారు.
కానీ అమరుల త్యాగాలను రాజకీయ స్వార్థానికి సీఎం కేసీఆర్ ఉపయోగించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకుంట్ల చరిత్రనే తెలంగాణ చరిత్ర అన్నట్టు వ్యవహరిస్తున్నారనీ, అమరుల బలిదానాల ను కేసీఆర్ అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ ఉద్యమంలో 1,569 మంది అమరులయ్యారని గుర్తు చేశారు. త్యాగాలు చేసిన వారిని అవమానించేలా బీఆర్‌ఎస్ వ్యవహరిస్తున్నదని తెలిపారు. అమరవీరుల స్థూపం నిర్మాణానికి సంబంధించి 2017, జూన్ 17న ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. డిజైన్, అంచనాల కోసం, పనులను పరిశీలించేం దుకు ఆరు శాతం ఫీజు చెల్లించాలని నిర్ణయించారని తెలిపారు. 2018, జూన్ 28న నిర్మాణం కోసం రూ. 64 కోట్ల వ్యయంతో టెండర్ ప్రకటన చేశారని వివరించారు.
ఒకే కంపెనీ మూడు డమ్మీ టెండర్లు వేసిందని పేర్కొన్నారు. కేసీ పుల్లయ్య కంపెనీ టెండరు దక్కించుకుందనీ, ఆ కంపెనీ కేటీఆర్‌తో కలిసిన తర్వాత కేపీసీ ప్రాజెక్ట్సు లిమిటెడ్‌గా మారిందన్నారు. ఆ కంపెనీ ప్రొద్దుటూరు, కడప జిల్లాకు చెందిన వ్యక్తులదనీ, కేపీసీ కంపెనీ అడ్రెస్ విజయవాడకు మారిందన్నారు. కేపీసీ ప్రాజెక్స్ట్ అనిల్ కుమార్ కామిశెట్టితో వ్యూహాత్మకంగా తేలుకుంట్ల శ్రీధర్ కేటీఆర్‌కు మేలు జరిగేలా చేశారన్నారు. దీంతో నిర్మాణ అంచనా వ్యయం రూ. 127 కోట్ల నుంచి అంచెలంచెలుగా రూ. 179 కోట్లకు పెరిగిందన్నారు. ఇంత ఖర్చు చేసి కట్టిన స్మారకంలో కేవలం అమరవీరులకు జోహార్లు అని మాత్రమే రాసి సరిపెట్టడం సరికాదని రేవంత్ అన్నారు. శిలాఫలకంపై అమరుల పేర్లు పెట్టనప్పుడు రాష్ట్రంలో శిలాఫలకాలపై సీఎం కేసీఆర్ పేరు ఎందుకు పెట్టాలి అని ప్రశ్నించారు. చరిత్రను మలినం చేసేందుకే కేసీఆర్ కుట్ర చేస్తున్నారనీ, దీన్ని తెలంగాణ సమాజం గ్రహించాలన్నారు. వందలాది మంది వీరుల త్యాగాలను కేసీఆర్ కాలగర్భంలో కలిపేశారన్నారు. శ్రీకాంతాచారి, ఇషాన్ రెడ్డి, కానిస్టేబుల్ కిష్టయ్య… వందలాది మంది అమరులు గుర్తొచ్చేలా ఉండాలన్నారు.









