కర్నాటక ఫలితాల తర్వాత జోరుమీదున్న హస్తం పార్టీ… తెలంగాణలో సైతం అదే స్థాయిలో ఫలితాలను రాబట్టేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అందులో భాగంగా ఢిల్లీ హైకమాండ్ దిశా నిర్దేశంతో
వడివడిగా అడుగులేస్తున్నది. టికెట్లు రావనుకున్న నేతలు, ఆయా పార్టీల్లో సరైన గుర్తింపు లేకుండా అసంతృప్తిగా ఉన్న నాయకులను గుర్తించి, ఎలాగైనా సరే వారిని పార్టీలో చేర్పించేందుకు హస్తం పార్టీ భారీ ప్రణాళికనే సిద్ధం చేసినట్టు గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి. ఏ విషయంలోనూ తగ్గకుండా అధికార పార్టీలను ఢీ కొట్టేందుకు క్యాడర్‌ను సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. అందులో భాగంగానే కోడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డితో రేవంత్‌రెడ్డి భేటీ కావడం, పార్టీలో చేరేందుకు ఆయన అంగీకరించడంతో పార్టీకి మరింత ఊపొచ్చిందని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
నిర్మల్ కాంగ్రెస్ ఇంచార్జి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి బీజేపీలో చేరడంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు బీఆర్ఎస్ నుంచి మరో ముఖ్యమైన నేతలను పార్టీలో చేర్చుకుంది. కాంగ్రెస్‌కు బలమైన పునాది ఉన్న ఆదిలాబాద్‌పై రేవంత్ ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో బలమైన శక్తిగా ఉన్న కాంగ్రెస్ మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాలపై పట్టు బిగించా లని భావిస్తున్నది. ఇప్పటికే అధిష్టానం కూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్పినట్టు ఆ వర్గాలు అంటున్నాయి. ఈక్రమంలో కర్నాటక ఎన్నికల్లో పని చేసిన అనుభవం ఉన్న కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీపీ విష్ణునాథ్, కర్నాటక నేత మన్సుర్ అలీఖాన్‌ను సైతం రంగంలోకి దించినట్లు సమాచారం.