బాసర ట్రిపుల్ ఐటీలో ఇద్దరు విద్యార్థినిల ఆత్మహత్య ఘటన మరువక ముందే తాజాగా నిజామాబాద్‌లో మరో విద్యార్థిని ప్రాణాలు తీసుకుంది. ఆర్మూర్ ఎస్సీ బాలికల హాస్టల్లో రక్షిత అనే విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆర్మూర్‌లోని నరేంద్ర డిగ్రీ కళాశాలలో రక్షిత మూడవ సంవత్సరం చదువుతోంది. తోటి విద్యార్థినిల సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రక్షిత ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. విద్యార్థిని స్వస్థలం మెండోరా మండల కేంద్రం. రక్షిత మృతివార్త తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.









