జూన్ మూడో వారంలోనూ నైరుతి రుతుపవనాల జాడ కనిపించడం లేదు. ఇప్పటికే దేశంలో దాదాపు సగం ప్రాంతానికి రుతుపవనాలు విస్తరించాల్సి ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో సైతం విస్తరించలేదు. దీంతో మన దగ్గర ఎండలు మండిపతున్నాయి. ఇక ఉత్తరాదిలోనైతే భానుడి భగభగలకు జనం విలవిల్లాడుతున్నారు. ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో వడగాల్పులకు జనం పిట్టల్లా రాలుతున్నారు. యూపిలోని బల్లియా జిల్లాలో వడదెబ్బ మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇక్కడి జిల్లా హాస్పిటల్‌లో 72 గంటల వ్యవధిలోనే వడదెబ్బ తగిలి 54 మంది ప్రాణాలు కోల్పోయారు. బల్లియా జిల్లా హాస్పిటల్‌లో 8 రోజుల్లో 121 మందికిపైగా వడదెబ్బతో చనిపోయారు. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం లక్నో నుంచి డైరెక్టర్ స్థాయి ఇద్దరు అధికారులను బల్లియాకు పంపించింది.
ప్రస్తుతం ఈ హాస్పిటల్‌లో 400 మందికిపైగా వడదెబ్బకు చికిత్స తీసుకుంటున్నారు. వీరిలో ఎక్కువగా 60 ఏళ్లు పైబడిన వారే ఉన్నారు. ఇంత మంది చనిపోవడానికి వడదెబ్బ కారణం కాదని హాస్పిటల్ వర్గాలు చెబుతుండటం గమనార్హం. బల్లియా జిల్లా హాస్పిటల్‌లో వడదెబ్బ కారణంగా 34 మంది చనిపోయారని చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ (సీఎంఎస్) డాక్టర్ దివాకర్ సింగ్ శుక్రవారం సాయంత్రం ప్రకటించారు. బాధ్యత రాహిత్యమైన ప్రకటన చేశారనే కారణంతో.. మరుసటి రోజే ఆయన్ను ఆ పదవి నుంచి తప్పించారు. మరణించిన వారంతా వృద్ధులని వారికి ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయని ఆరోగ్య శాఖ మంత్రి బ్రజేశ్ పాఠక్ తెలిపారు.









