AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనం ఖాయమా..?

బలం చేకూరుస్తున్న షర్మిల లేటెస్ట్ ట్వీట్
రాహుల్‌కు షర్మిల బర్త్ డే విషెస్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు తన బర్త్ డేను జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీకి వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బర్త్ డే విషెస్ చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఈ మేరకు రాహుల్‌కు విషెస్ చెబుతూ షర్మిల ట్వీట్ చేయగా.. ఇది వైరల్‌గా మారింది. వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే ప్రచారం గత కొద్దిరోజులుగా జరుగుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యానని, త్వరలోనే అధికారిక ప్రకటన ఉండొచ్చని చెబుతున్నారు. ఈ ఊహాగానాల క్రమంలో రాహుల్‌కు షర్మిల విషెస్ చెప్పడం హాట్‌టాపిక్‌గా మారింది.

షర్మిల ట్వీట్‌తో కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనం ఖాయమైందని, అందుకు ఇది బలం చేకూరుస్తుందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు షర్మిలతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ ఫోన్‌లో చర్చలు జరిపారు. కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీని విలీనం చేయాలని కోరారు. దీనికి షర్మిల కూడా అంగీకరించినట్లు వార్తలొచ్చాయి. పొత్తుకు సంబంధించి ఇతర పార్టీల నుంచి ఫోన్లు వస్తున్న విషయాన్ని షర్మిల కూడా ధృవీకరించారు. చాలా పార్టీల నుంచి తనకు ఫోన్లు వస్తున్నాయని, కానీ లిఫ్ట్ చేయడం లేదని గతంలో మీడియా సమావేశంలో షర్మిల బయటపెట్టారు.

కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్‌టీపీ విలీనానికి లైన్ క్లియర్ అయిందనే ప్రచారం బలంగా జరుగుతోంది. ఇందుకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో పాటు మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు మధ్యవర్తిత్వం వహించినట్లు చెబుతున్నారు. రానున్న తెలంగాణ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరు నుండి షర్మిల పోటీ చేయడానికి కాంగ్రెస్ అధిష్టానం ఓకే చెప్పిందని, ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఏపీ ఎన్నికల్లో కూడా షర్మిలను కాంగ్రెస్ ఉపయోగించుకోనుందని అంటున్నారు. రేపో, మాపో కేవీపీ రామచంద్రరావు, డీకే శివకుమార్‌లతో షర్మిల భేటీ కానుందని, ఈ భేటీ తర్వాత విలీనంపై మరింత స్పష్టత వచ్చే అవకాశముందని చెబుతున్నారు.

ANN TOP 10