మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పేరు ఖరారు
ప్రకటించిన పార్టీ అధిష్టానం
తెలంగాణలో, ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనున్న పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ అధిష్టానం పేర్లను ప్రకటించింది. మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ తరఫున తమ అభ్యర్థిగా వెంకటనారాయణ రెడ్డి నిలుపుతున్నట్లు ప్రకటిచింది. హైదరాబాద్ స్థానిక సంస్థలతో పాటు హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం విదితమే.
త్వరలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రజల్లోకి పాజిటివ్ వేవ్ పంపించాలని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. బలమైన అభ్యర్థులను పోటీలో నిలిపి సత్తా చాటాలని భావిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి తమ అభ్యర్థిగా వెంకట నారాయణరెడ్డి నిలుపుతున్నట్లు బీజేపీ అదిష్టానం ప్రకటిచింది. ఏపీలోని కడప గ్రాడ్యుయేట్ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాఘవేంద్ర, ప్రకాశం గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా దయాకర్‌రెడ్డి, శ్రీకాకుళం గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా మాధవ్‌ను ప్రకటించింది ఆ పార్టీ.
ఈనెల 16న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్లకు చివరి తేదీ ఫిబ్రవరి 23 కాగా.. ఫిబ్రవరి 24న నామినేషన్లను పరిశీలిస్తారు. ఫిబ్రవరి 27 వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఈసీ గడువిచ్చింది. మార్చి 13న పోలింగ్ జరగనుండగా.. మార్చి 16న కౌంటింగ్ జరపనున్నట్లు ఎన్నికల సంఘం షెడ్యూల్‌లో పేర్కొన్న విషయం విదితమే.