AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పవన్ కళ్యాణ్ మాకు ప్రత్యార్థా?.. ఆయనో ప్యాకేజీ స్టార్: జగన్

పవన్ కళ్యాణ్ మాకు ప్రత్యార్థా?.. ఆయనో ప్యాకేజీ స్టార్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. వైఎస్ జగన్ కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటించారు. మల్లాయపాలెంలో 77 ఎకరాల్లో నిర్మించిన 8,912 టిడ్కో ఇళ్లను సీఎం ప్రారంభించారు. మరో 178.63 ఎకరాల్లో సిద్ధం చేసిన 7,728 మందికి ఇళ్ల పట్టాలు, కడుతున్న 4,500 ఇళ్లకు పట్టాలను పంపిణీ కార్యక్రమం కూడా జరిగింది. ప్రభుత్వం టిడ్కో ఇళ్లను కేవలం రూపాయికే అన్ని హక్కులతో అందజేస్తోంది. ప్రతి లబ్ధిదారునికి రూ. 7లక్షల ఆస్తిని ఉచితంగా ఇచ్చామన్నారు సీఎం జగన్‌. 8,659 ఇళ్లకు అదనంగా జూలై 7న మరో 4,200 ఇళ్లు మంజూరు చేస్తామని.. రాష్ట్రంలో 30.68 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామన్నారు.

చంద్రబాబు పేదల వ్యతిరేకి అన్నారు సీఎం జగన్‌. మూడుసార్లు సీఎం అయిన చంద్రబాబు టిడ్కో ఇళ్లు కట్టలేకపోయారని.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక్కవర్గానికైనా మంచి చేశారా అని ప్రశ్నించారు. మరోసారి ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు తయారయ్యారని.. మరోసారి ఛాన్స్‌ ఇవ్వాలంటున్న బాబు అప్పుడు ఏం చేశారన్నారు. మంచి చేశాను కాబట్టి ఓటు వేయండి అని అడగడం లేదు.. ప్రజలకు మంచి చేసిన చరిత్రే బాబు దగ్గర లేదన్నారు. టిడ్కో ఇళ్ల కోసం చంద్రబాబు పేదల పేరుపై అప్పుగా రాశారని.. పేదలు నెలకు రూ. 3వేల చొప్పున 20 ఏళ్లు కట్టాలన్నారు. చంద్రబాబు తాను చేయని పని చేసినట్టుగా ప్రచారం చేసుకున్నారని ఎద్దేవా చేశారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పైనా జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన వ్యాన్ చూసుకుని పవన్ మురిసిపోతున్నారని.. 175కి 175 స్థానాల్లో అభ్యర్థుల్ని పెట్టలేనివారు కూడా ప్రత్యర్థా అంటూ విరుచుకుపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి రావడానికి ఇంటికో కారు, బంగారం ఇస్తానన్నా ఆశ్చర్యం లేదన్నారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబు తిరిగి కుప్పానికి బయల్దేరారని సెటైర్లు పేల్చారు. చంద్రబాబుది పెత్తందారుల పార్టీ అని.. ధ్వజమెత్తారు. జిత్తులు, పొత్తులు, ఎత్తులనే నమ్ముకోని రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

చంద్రబాబు పక్కన రెండు పార్టీలు లేకపోతే లేచి నిలబడలేరని.. అటు ఎమ్మెల్యే అవుతా అంటూ ప్యాకేజీ స్టార్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వీరందరికీ అనుకూల మీడియా ఉంది.. వీరందరికీ అధికారం కావాలి అన్నారు. పేదలను దోచుకోవటమే వారి లక్ష్యమని.. తాను మాత్రం ప్రజలనే నమ్ముకున్నాను అన్నారు. ఇంత మంది ఏకం అయినప్పటికీ భయపడే బిడ్డ జగన్ కాదు అన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10