టీపీసీసీ రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ
జోగురామన్నను ఓడిస్తేనే జిల్లా ప్రగతి బాట: కంది శ్రీనన్న
కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు
హైదరాబాద్: కాంగ్రెస్‌లో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరారు. గురువారం కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస రెడ్డి నాయకత్వంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో వీరు చేరారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు మాజీ కౌన్సిలర్లు, బీఆర్‌ఓఎస్, బీజేపీ జిల్లా, మండల నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చిన వారందరికీ పార్టీ కండువా కప్పి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ జోగురామన్నను ఓడిస్తేనే జిల్లాలో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఈసారి జోగురామన్నను ఓడిరచి ఇంటికాడ కూర్చోబెట్టాలని ఆయన కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్, బీజేపీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు పేరుపేరున ధన్యవాదాలని తెలిపారు.

జోకుడు రామన్న..
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆదిలాబాద్ నియోజకవర్గ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారందరికీ సాదర స్వాగతం పలికారు. జోగు రామన్నను జోకుడు రామన్న అంటే బాగుంటదని ఎద్దేవా చేశారు. జోగు రామన్న చెల్లని రూపాయని, అందుకే కేసీఆర్ ఆయనకు మళ్లీ మంత్రి పదవి ఇవ్వవలేదన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు బీఆర్‌ఎస్ పార్టీ చేసిందేమీలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామన్నారు. జిల్లాలో గృహ నిర్మాణ శాఖ మంత్రి ఉన్నా… అక్కడి ప్రజలకు ఇప్పటి వరకు డబుల్‌బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇల్లు కట్టుకునే పేదలకు రూ.5లక్షలు అందిస్తామన్నారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తాం అని స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5లక్షల వరకు పేదలకు ఉచిత వైద్యం అందిస్తామని, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డల కష్టాలు తీరుస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొడితేనే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని అన్నారు. కర్ణాటకలో మాదిరి తెలంగాణలో కూడా మహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సదుపాయం కల్పిస్తామని కార్యకర్తల హర్షాధ్వానాల మధ్య ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లాలో 8 అసెంబ్లీ స్థానాలు మీరు గెలిపించండి.. రాష్ట్రంలో 80 అసెంబ్లీ స్థానాలు గెలిపించే బాధ్యత నేను తీసుకుంటా.. అని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ను గెలిపించి సోనియమ్మకు జన్మదిన కానుక ఇద్దామని కార్యకర్తలకు, నాయకులకు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.









