AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెల్లారితే పెళ్లి.. ఇంతలోనే కోలుకోలేని ‘దెబ్బ’..

వడదెబ్బతో తీవ్ర అనారోగ్యానికి గురైన యువకుడు
చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. తెల్లారితే పందిట్లో పెళ్లి చేసుకోవాల్సిన యువకుడు.. విగతజీవిగా మారిపోయాడు. దానికి కారణం భగభగ మండుతున్న సూర్యుడే. కౌటాల మండలం గుడ్ల బొరీ గ్రామంలో పెళ్లి కొడుకును వడదెబ్బ మింగేసింది. గ్రామానికి చెందిన గుండ్ల సాలయ్య – యశోద దంపతులకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఇందులో పెద్దకొడుకు అయిన గుండ్ల తిరుపతి (26)కి ఇటీవలే పెళ్లి కుదిరింది. వధువుది మంచిర్యాల జిల్లా భీమిని గ్రామం. అయితే.. బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు వివాహ ముహూర్తం పెట్టుకున్నారు. అయితే.. తన పెళ్లి పనులను తానే భుజాల మీదేసుకుని చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో. తిరుపతికి సోమవారం వడదెబ్బ తగిలింది.

దీంతో.. తిరుపతికి వాంతులు, విరేచనాలు అందుకున్నాయి. తీవ్ర స్థాయిలో నిరసపడిపోయాడు. తెల్లారితే పెళ్లి పెట్టుకుని తిరుపతి పరిస్థితి ఇలా అయిపోవటం చూసిన కుటుంబసభ్యులు వెంటనే.. కాగజ్ నగర్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్చి చికిత్స అందించారు. అయినా కూడా తిరుపతి పరిస్థితిలో మార్పు లేదు. మంగళవారం రాత్రి వరకు అతని ఆరోగ్య పరిస్థితి ఇక ఇబ్బందికరంగా మారడంతో… మెరుగైన చికిత్స కోసం మంచిర్యాలకు తరలించారు.

అయితే.. దురదృష్టవశాత్తు మంచిర్యాలలో చికిత్స పొందుతూ తిరుపతి మృతి చెందాడు. తెల్లారితో పట్టుబట్టలు కట్టుకుని.. పచ్చని పందిట్లో పెళ్లి కొడుకులా కూర్చోవాల్సిన తిరుపతి.. విగతజీవిగా మారటంతో.. కుటుంబంతో పాటు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. తిరుపతి సోదరుడు శ్రీనివాస్ గ్రామ సర్పంచ్‌గా కొనసాగుతూ ఆరు నెలల కిందటే అనారోగ్యంతో మృతి చెందాడు. పెళ్లి కోసం వేసిన పందిట్లో పెళ్లి కొడుకు మృతదేహాన్నే పెట్టాల్సి రావటాన్ని చూసి.. కుటంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

ANN TOP 10