AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తమిళనాడు మంత్రికి 14 రోజుల జుడిషియల్ రిమాండ్

మనీ లాండరింగ్ కేసులో బుధవారం తెల్లవారుజామున ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) అధికారులు అరెస్టు చేసిన తమిళనాడు విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని జూన్ 28 వరకు జుడిషియల్ కస్టడీకి అప్పగిస్తూ సెషన్స్ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది.

బుధవారం తెల్లవారుజామున సెంథిల్ బాలాజీని కస్టడీలోకి తీసుకున్న ఇడి అధికారులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వద్ద కారులో బాలాజీ భోరున విలపిస్తూ మీడియా కంటపడ్డారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మంత్రివర్గంలో ఒక మంత్రిని మనీలాండరింగ్ కేసులో ఇడి అరెస్టు చేయడం ఇదే మొదటిసారి.

మంగళవారం ఆయన నివాసంలో ఇడి అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. నలతగా ఉందని చెప్పడంతో ఆయనను ఇడి అధికారులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందచేశారు. అనంతరం ఆయనను సెషన్స్ కోర్టులో హాజరుపరిచారు. మంత్రి అరెస్టుతో తమిళనాడు రాజకీయాల్లో హీట్‌ పెరిగింది.

సెంథిల్‌ బాలాజీ తన సహాయకులు సిఫారసు చేసిన అభ్యర్థులను నియమించేందుకు ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌ అధికారులతో కలిసి కుట్ర పన్నారనే ఆరోపణలపై కేసు నమోదైంది. ఉద్యోగాల కోసం కోట్లాది రూపాయలు లంచం తీసుకున్నారని ఈడీ ఆరోపించింది. సెంథిల్‌ బాలాజీ రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో 2014 నుంచి 2015 మధ్య కాలంలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఆ సమయంలో ఆయన ఏఐఏడీఎంకే నాయకుడిగా ఉన్నారు. ఆ తర్వాత 2018లో ఆయన డీఎంకేలో చేరారు.

ANN TOP 10