రెండు వర్గాల మధ్య వైరంతో కుతకుతలాడుతున్న మణిపూర్‌లో (Manipur) శాంతి చర్యలకు మళ్లీ విఘాతం కలిగింది. మణిపూర్‌లోని ఈస్ట్ ఇంఫాల్‌లోని ఖమెన్‌లాక్ ప్రాంతంలో తిరిగి హింసాకాండ (Violenve) చెలరేగింది. మంగళవారం రాత్రి చోటుచేసుకున్న కాల్పుల్లో ఒక మహిళతో సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే భద్రతా బలగాలు ఆ గ్రామానికి చేరుకున్నారు. తాజా హింసాకాండతో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఇటీవల మణిపూర్‌లో పర్యటించడం ద్వారా పరిస్థితులు చక్కబడతాయని భావించిన కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది.
ఈస్ట్ ఇంపాల్ ఎస్పీ శివకాంత్ సింగ్ కథనం ప్రకారం, మిలిటెంట్లు అత్యాధునికి ఆయుధాలతో ఇంఫాల్ ఈస్ట్ సరిహద్దు జిల్లాలోని ఖమెలాక్ ప్రాంతంలోని గ్రామస్థులను మంగళవారం అర్ధారాత్రి ఒంటిగంట ప్రాంతంలో చుట్టుముట్టి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మెయితీల ఆధిపత్యం ఉన్న ఇంఫాల్ ఈస్ట్ జిల్లాకు, గిరిజన మెజారిటీ ఉన్న కాంగ్పోక్తి జిల్లాకు సరిహద్దు వెంబడి ఖమెలాక్ ప్రాంతం ఉంది. తాజా ఘటన అనంతరం ఇటీవల సడలించిన కర్ఫ్యూ ఆంక్షలను తిరిగి అమల్లోకి తెచ్చారు. ప్రస్తుతం మణిపూర్‌లోని 16 జిల్లాలకు 11 జిల్లాల్లో కర్ఫూ అమల్లో ఉంది. ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు.









