నిమ్స్ నూతన బ్లాక్ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ ఎర్రమంజిల్‌లో దశాబ్ది బ్లాక్ పేరుతో నిర్మిస్తున్న నిమ్స్ హాస్పిటల్ భవనాలకు సీఎం కేసీఆర్ భూమిపూజ చేశారు. ఈ దశాబ్ది భవనాల నిర్మాణంతో నిమ్స్‌లో మరో 2000 పడకలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో దేశంలో అత్యధిక సూపర్ స్పెషాలిటీ పడకలు ఉన్న దవాఖానగా నిమ్స్ ముందు వరుసలో నిలువన్నది.
ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక అనుబంధం2009లో ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయనకు నిమ్స్‌లోనే వైద్యం అందించారు. ఆనాటి నుంచి నిమ్స్‌తో సీఎం కేసీఆర్‌కు మంచి అనుబంధం ఉన్నది.
నిమ్స్‌కు అన్ని రకాల హంగులు ఉన్నా.. అరకొర వసతులతో కొట్టుమిట్టాడుతున్న విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తించారు. అందుకే ఏటా రూ.100 కోట్లు కేటాయించి నిమ్స్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇచ్చిన మాటను అమల్లోకి తెస్తూ మొదటి ఏడాదే 2014-15లో రూ.185 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత క్రమం తప్పకుండా నిమ్స్‌కు నిధులు కేటాయిస్తూనే ఉన్నారు. 2022లో నిమ్స్‌కు రూ.242 కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది ఏకంగా రూ.290 కోట్లు కేటాయింపులు జరిపారు. ఇప్పుడు నిమ్స్ విస్తరణకు నడుం బిగించారు.









