వరల్డ్ వైడ్‌గా మూవీ లవర్స్ ఎదురుచూస్తున్న చిత్రం ‘గ్లాడియేటర్ 2’(Gladiator 2). 2000 సంవత్సరంలో వచ్చిన ‘గ్లాడియేటర్’కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఐదు ఆస్కార్ అవార్డులను దక్కించుకుంది. మళ్లీ 23 ఏళ్ల తర్వాత ఈ సినిమా సీక్వెల్‌ను రూపొందిస్తున్నారు. ఈ సినిమా సెట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడినట్లు చిత్రబృందం తెలిపింది. ప్రమాదానికి సంబంధించిన కారణాలు గురించి తెలియాల్సి ఉంది. (Fire Accident)
‘సెట్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తుండగా అగ్ని ప్రమాదం జరిగిందని హాలీవుడ్ (hollywood) మీడియా వెల్లడించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారని, వెంటనే అప్రమత్తమైన యూనిట్ సభ్యులు తీవ్ర గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారని తెలిసింది. ‘ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదంలో ప్రధాన తారగణానికి ఎటువంటి గాయాలు కాలేదు’ అని చిత్రబృందం తెలిపింది. అయితే సెట్ అంతా కాలిపోయిందని, దాని వల్ల షూటింగ్ ఆలస్యమవుతుందని పేర్కొంది. ఈ ప్రమాదంతో షూటింగ్ ఆలస్యం కావడం వల్ల సినిమా విడుదలలో జాప్యం జరుగుతుందేమో అని అభిమానులు నిరాశ పడుతున్నారు రిడ్లీ స్కాట్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది నవంబర్‌లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.