AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దొంగల బీభత్సం.. గంటలోనే రూ.7 కోట్ల దోపిడీ.. ఎక్కడంటే..

పంజాబ్‌లోని లుధియానాలో భారీ దోపిడీ జరిగింది. బ్యాంకులకు సేవలందించే సీఎంఎస్‌ సెక్యూరిటీస్‌ కార్యాలయంలోకి చొరబడిన ఆగంతుకులు రూ.7 కోట్ల నగదు దోచుకెళ్లారు. న్యూ రాజ్‌గురు నగర్‌లో ఉన్న సంస్థ ఆఫీసులోకి శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 8 మంది మాస్క్‌లు ధరించి దుండగులు ప్రవేశించారు. తుపాకీతో బెదిరించి, సెక్యూరిటీ సిబ్బందిని గదిలో బంధించి, సెల్‌ఫోన్లను ధ్వంసం చేశారు. అనంతరం అక్కడ దొరికిన సుమారు రూ.7 కోట్ల నగదుతో సీఎంఎస్‌కు చెందిన వ్యానులోనే ఉడాయించారు. సీసీటీవీ కెమెరాలను కూడా వెంట తీసుకెళ్లారు.

చోరీ గురించి ఉదయం 7 గంటల వరకూ పోలీసులకు సమాచారం రాలేదు. ఘటనా స్థలికి చేరుకుని లుధియానా పోలీస్‌ కమిషనర్‌ మన్‌దీప్‌ సింగ్‌ సిద్ధూ పరిశీలిచింది. తీసుకెళ్లిన వ్యానును ముల్లన్‌పూర్‌ దాఖా వద్ద వదిలిపెట్టారని, అందులో రెండు రైఫిళ్లు లభ్యమయ్యాయని ఆయన తెలిపారు. సీఎంఎస్‌ సంస్థ నిర్లక్ష్యం వల్లే దోపిడీ జరిగినట్టు తెలుస్తోంది. లాకర్లలో భద్రంగా ఉండాల్సిన నగదును వ్యానుల్లోనూ, కార్యాలయం గదిలోనూ అజాగ్రత్తగా వదిలేసినట్లు సమాచారం. ఘటన సమయంలో సంస్థ సిబ్బందిలో ఇద్దరి వద్ద ఆయుధాలు కూడా ఉన్నాయి.

‘దోపిడీకి గురైన నగదు విషయంలో బాధిత సంస్థ నుంచి ఇంకా స్పష్టత రాలేదు.. ఘటనలో లోపలి వ్యక్తుల ప్రమేయం పైనా దర్యాప్తు జరుపుతున్నాం’అని తెలిపారు. కేసును ఛేదించేందుకు యాంటీ గ్యాంగ్‌స్టర్‌ టాస్క్‌ఫోర్స్, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్‌ సాయం కూడా తీసుకుంటున్నామన్నారు. నిందితులు తెల్లవారుజామున 1. 30 గంటల నుంచి సుమారు గంటసేపు అక్కడే ఉన్నారు. దోపిడీకి వచ్చినవారిలో మహిళ గొంతు వినిపించిందని సిబ్బంది చెప్పడంతో దొంగల్లో ఓ మహిళ కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ANN TOP 10