భారత రాష్ట్ర సమితి పార్టీ కేంద్ర కార్యాలయానికి ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ‘భారత్ భవన్’ పేరిట కోకాపేటలో నిర్మించనున్న ఈ భవనానికి సోమవారం కేసీఆర్ భూమిపూజ చేయనున్నారు. భారత్ భవన్‌ను 15 అంతస్తులతో నిర్మించనున్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకురావాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.
భారత్ భవన్ నిర్మాణంతో పాటు ‘ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎక్సలెన్స్’, ‘హ్యుమన్ రిసోర్స్ డెవల్‌పమెంట్’ పేరిట మరికొన్ని నిర్మాణాలను బీఆర్‌ఎస్ చేపట్టనుంది. భారత్ భవన్ నిర్మాణం పూర్తయిన తర్వాత కేసీఆర్ అక్కడి నుంచే పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు.ఢిల్లీ వెళ్లినప్పుడు అక్కడి జాతీయ కార్యాలయం నుంచి బీఆర్‌ఎస్ పనులు చూసుకుంటారు. మిగతా సమయాల్లో భారత్ భవన్ నుంచే పార్టీ పనులన్నీ చక్కబెట్టనున్నట్లు సమాచారం.