తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు జూన్ రెండో వారంలో ప్రవేశించనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనావేస్తోంది. ఈనెల మొదటి వారంలో కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు క్రమంగా జూన్ రెండో వారం నాటికి తెలంగాణను తాకే అవకాశం ఉంది. రుతుపవనాలు ప్రవేశించడంతో ఎండలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు తెలిపింది. బుధవారం పలు జిల్లాల్లో పగటి గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. నల్లగొండలో 41.5, నిజామాబాద్ 40.9, భద్రాచలం, మెదక్ జిల్లాల్లో 40.8 చొప్పున, ఆదిలాబాద్‌లో 40.3, హైదరాబాద్‌లో 38.9 డిగ్రీలు నమోదైంది.
గత రెండు సీజన్లలో పోల్చితే ఈసారి కాస్త ఆలస్యంగానే రుతుపవనాలు రానున్నాయి. 2021లో నైరుతి రుతుపవనాలు మే నెలాఖరులోనే కేరళను తాకగా, జూన్ మొదటి వారంలో రాష్ట్రాన్ని తాకాయి. ఇక గతేడాది మే 30న రుతుపవనాలు కేరళను తాకగా.. జూన్ 8కి రాష్ట్రానికి చేరాయి. ఈ రెండు సీజన్లతో పోలిస్తే ఈసారి ఐదు రోజులు ఆలస్యంగా రానున్నట్లు వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు.









