పోర్టులు, జాతీయ రహదారుల అభివృద్ధితోనే దేశ ప్రగతి ముడిపడి ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ సదస్సులో ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల కల్పనపై ఆయన కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో రూ.1.20 లక్షల కోట్ల భారీ వ్యయంతో చేపడుతున్న రహదారి ప్రాజెక్టులు, పోర్టుల అనుసంధానం ఏపీ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చనున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
భారీగా తగ్గనున్న ప్రయాణ సమయం
రాష్ట్రంలో రవాణా రంగాన్ని పరుగులు పెట్టించేందుకు అనేక గ్రీన్‌ఫీల్డ్ కారిడార్లను నిర్మిస్తున్నట్లు గడ్కరీ వెల్లడించారు. రూ.14 వేల కోట్లతో చేపట్టిన 340 కి.మీల బెంగళూరు-విజయవాడ కారిడార్‌తో ప్రయాణ సమయం ఏకంగా 12 గంటల నుంచి 4.5 గంటలకు పడిపోనుందని తెలిపారు. అలాగే, రాయ్‌పూర్-విశాఖ కారిడార్ పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయని, ఇది ఏపీతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు ఎంతో లాభసాటిగా మారుతుందని పేర్కొన్నారు.
పోర్టులే ఏపీకి అసలైన బలం
ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతాన్ని, పోర్టులను మరింత అనుసంధానించడమే తమ ప్రధాన లక్ష్యమని గడ్కరీ అన్నారు. విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం వంటి ఓడరేవులను జాతీయ రహదారులతో అనుసంధానించడం ద్వారా లాజిస్టిక్స్ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని తెలిపారు. దీనివల్ల ఎగుమతులు, దిగుమతులు ఊపందుకుని, రాష్ట్రం పారిశ్రామికంగా అగ్రపథంలో నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
అమరావతికి ఊతమిచ్చే ప్రాజెక్టులు
రాజధాని అమరావతి అభివృద్దికి కేంద్రం పెద్దపీట వేస్తోందని గడ్కరీ స్పష్టం చేశారు. అమరావతి చుట్టూ ప్రతిష్టాత్మకంగా 192 కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంతో పాటు, ఖరగ్‌పూర్-అమరావతి కారిడార్ వంటి ప్రాజెక్టులు రాష్ట్రాన్ని ఉత్తర-దక్షిణాది రాష్ట్రాలతో బలంగా అనుసంధానిస్తాయని తెలిపారు. ఈ మౌలిక వసతులన్నీ భవిష్యత్తులో ఏపీ ఆర్థిక రూపురేఖలను సమూలంగా మారుస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.








