తెలుగు రాష్ట్రాల్లో సామాన్యుడికి కోడిగుడ్డు ధర షాక్ ఇస్తోంది. దాదాపు మూడు నెలల పాటు నిలకడగా ఉన్న గుడ్ల ధరలు కొద్ది రోజులుగా క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. హోల్‌సేల్ మార్కెట్లో డజన్ గుడ్ల ధర గతంలో రూ.80 ఉండగా, నాలుగైదు రోజుల క్రితం రూ.90కి చేరింది. ప్రస్తుతం ఆ ధర ఏకంగా రూ.96కు చేరుకుంది. స్వల్ప వ్యవధిలోనే డజన్‌పై రూ.16 మేర ధర పెరగడంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు.
హోల్‌సేల్ ధరలకు అనుగుణంగా రిటైల్ మార్కెట్లోనూ ధరలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. గతంలో చిల్లర దుకాణాల్లో రూ.6 నుంచి రూ.7 మధ్య పలికిన ఒక్కో కోడిగుడ్డు ధర, ప్రస్తుతం రూ.7.50 నుంచి రూ.8 వరకు పలుకుతోంది. ఆగస్టు మొదటి వారంలో తగ్గిన గుడ్డు ధర.. డజన్ రూ.80 వద్దే దాదాపు వారం క్రితం వరకు స్థిరంగా కొనసాగింది. అయితే గత కొద్ది రోజులుగా డిమాండ్‌కు తగిన సరఫరా లేకపోవడం వంటి మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో ధరలు వేగంగా పెరిగాయి.
నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (NECC) సూచించిన హోల్‌సేల్ ధరల ప్రకారం.. నవంబర్ 13 నాటికి హైదరాబాద్‌లో 100 గుడ్ల ధర రూ.640గా ఉండగా, విశాఖపట్నంలో రూ.625 వద్ద నమోదైంది. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరల భారంతో సతమతమవుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రధాన పోషకాహార వనరుగా ఉండే కోడిగుడ్డు ధరలు కూడా పెరగడం మరింత భారంగా మారుతోంది. మార్కెట్లో ధరలు ఇంకా పెరుగుతాయా? లేక దిగివస్తాయా? అన్నది వేచి చూడాల్సి ఉంది.








