అక్రమ మార్గాల్లో విదేశీ మద్యాన్ని తెలంగాణకు తీసుకువస్తున్న 39 మందిని శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.12 లక్షలు విలువ చేసే 324 బాటిళ్ల విదేశీ మద్యాన్ని సీజ్ చేసినట్లు శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎ.సత్యనారాయణ తెలిపారు. ఒక రాష్ట్రంలోని డ్యూటీఫ్రీ మద్యాన్ని మరో రాష్ట్రానికి తరలించడం నేరమని ఆయన వివరించారు. గోవా, ఢిల్లీ, హరియాణా నుంచి సుంకం చెల్లించని లిక్కర్‌ను తరలిస్తున్నట్లు సమాచారం అందుకుని ఈ నెల 7, 8 తేదీల్లో శంషాబాద్ విమానాశ్రయంలో స్టేట్ టాస్క్‌ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్, రంగారెడ్డి జిల్లా టాస్క్‌ఫోర్స్, శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్ బృందాలు నిఘా పెట్టాయని తెలిపారు.
గోవా నుంచి వచ్చిన 39 మంది బ్యాగేజీలో 324 విదేశీ మద్యం బాటిళ్లను గుర్తించి, వారిని అరెస్టు చేశామన్నారు. ఈ మద్యం విలువ రూ.12 లక్షల వరకు ఉంటుందన్నారు. ఒక వ్యక్తికి ఇతర రాష్ట్రాల నుంచి ఆరు ఫుల్‌బాటిళ్లను తెచ్చుకునే అనుమతి ఉంటుందనే తప్పుడు ప్రచారంతో ఇలా విదేశీ మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు సత్యనారాయణ తెలిపారు. అలాంటి నిబంధన ఏదీ లేదని వెల్లడించారు.