కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమవ్వగా.. 11 గంటల సమయానికి 21 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. అత్యధికంగా ఉడుపి జిల్లాలో 13.28శాతం ఓటింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
ఓటేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిద్ధరామయ్య..
కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిద్ధారామయ్య ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ కాంగ్రెస్ పార్టీ 130కిపైగా సీట్లు గెలుచుకుంటుందని చెబుతూ వస్తున్నాను. ఈ సంఖ్య 150 వరకు కూడా వెళ్లవచ్చు. మే 13న ప్రకటించే ఎన్నికల్లో కాంగ్రెస్ కచ్చితంగా మెజారిటీ సాధిస్తుంది. పనిచేసే పార్టీకి ప్రజలు ఓటు వేయాలి. దేశ భవిష్యత్ కూడా ఈ ఎన్నికతో ముడిపడి ఉంది’’ అని వ్యాఖ్యానించారు.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, హుబ్లీ-ధర్వాడ్ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి జగదీష్ షెట్టర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. బజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడంపై ఆయన స్పందించారు. ‘ఇది చర్చించాల్సిన ప్రశ్న కాదు. రాజ్యాంగ విరుద్ధంగా ఏ సంస్థపైనైనా నిషేధం విధించడంపై ఇప్పటికే చాలా సందర్భాల్లో మాట్లాడాను. సంస్థలపై నిషేధం విధించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం ఉండదు’’ అని క్లారిటీ ఇచ్చారు.
సీఎం బసవరాజ్ బొమ్మై, ఆయన కూతురు అదితి, కొడుకు భరత్ బొమ్మై ముగ్గురూ హవేరి జిల్లాలో తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ఒక గవర్నమెంట్ స్కూల్లో ఓటు వేశారు.
పోలింగ్ జరుగుతుండగా రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు….
కర్ణాటక పోలింగ్ కొనసాగుతుండగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ 40 శాతం కమిషన్ రహిత’, ‘ప్రగతిశీల కర్ణాటక’ను ఏర్పాటు చేయాలంటే కర్ణాటక ఓటర్లను ఆయన కోరారు. పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన హిందీ ట్వీట్ చేశారు. మహిళా హక్కులు, యువతకు ఉపాధి, పేదలకు అండ విషయంలో హామీలను కచ్చితంగా నెరవేస్తామని పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ విన్నింగ్ 150’ హ్యాష్ ట్యాగ్‌ను క్రియేట్ చేశారు.
చిక్కమగళూరు జిల్లా ముడిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని మకొనహల్లిలో ఓ పెళ్లి కూతురు ఓటుహక్కు వినియోగించుకుంది. పోలింగ్ బూత్ నంబర్ 165 ఆమె ఓటు వేసింది.