కేసీఆర్ కు దొర గారికి ఢిల్లీ రాజకీయాల మీద ఉన్న సోయి.. తెలంగాణ రైతుల మీద లేదని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. వెన్నుపోటు పొడవడంలో కేసీఆర్ దిట్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా ఆమె కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో పరిహారం పేరుతో మిర్చి రైతులను నిండా ముంచారని.. ఇప్పుడు వరి రైతులను నట్టేట ముంచాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు.పది రోజుల్లో పరిహారమని చెప్పి.. నెల రోజులైనా రూపాయి ఇవ్వలేదని మండిపడ్డారు. అకాల వర్షాలకు 10 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినా.. దొర గారికి దున్నపోతు మీద వానపడ్డట్టే ఉందని విమర్శించారు. దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ప్రకటించకుండా .. తడిసిన ధాన్యం కొంటామని చెప్పి, మళ్లీ ఢిల్లీ పయనమైయ్యారని ఆగ్రహించారు. నష్టపోయిన రైతుల్లో సగం మంది కౌలు రైతులు ఉన్నా.. కనీసం పట్టింపు లేదన్నారు. రైతులు కన్నీరు పెడుతుంటే కల్లాల్లో ఉండాల్సిన ముఖ్యమంత్రి .. దేశ దోపిడీకి ఢిల్లీకి పయనమైండని మండిపడ్డారు.