న్యూఢిల్లీ: ప్రతినెల చివరి ఆదివారం ఆల్ ఇండియా రేడియోలో వచ్చే ‘మన్‌కీ బాత్’(మనసులో మాట) 100వ ఎపిసోడ్ ఆదివారం ప్రసారమైంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోని భావోద్వేగాలు తెలుసుకునేందుకు అవకాశం కలిగిందన్నారు ప్రధాని మోడీ. సామాన్యులకు సంబంధించి ప్రతినెల కొన్ని వేల సందేశాలు ‘మన్‌కీ బాత్’లో చదివానని మోడీ అన్నారు. ఈ కార్యక్రమం తనను ప్రజలకు మరింత చేరువ చేసిందన్నారు. అసామాన్య సేవలు అందించిన వ్యక్తుల గురించి తెలుసుకునే అవకాశం లభించిందన్నారు. చెట్లు నాటడం, పేదలకు వైద్యం అందించడం, ప్రకృతి పరిరక్షణకు నడుం బిగించడం వంటి కార్యక్రమాలు తనకు ప్రేరణ ఇచ్చాయన్నారు. ‘మన్‌కీ బాత్’ను 2014లో విజయదశమి రోజున ప్రారంభించినట్లు గుర్తుచేసుకున్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ‘మన్‌కీ బాత్’లో చర్చించామని తెలిపారు.
మోడీ ‘మన్‌కీ బాత్’ 100వ ఎపిసోడ్ చరిత్రలో నిలిచిపోయేలా బిజెపి అధ్యక్షుడు నడ్డా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. మన్‌కీ బాత్ ఏ ఎపిసోడ్ కా ఎపిసోడ్ ప్రత్యేకమైనది. ఇతరుల్లోని సద్గుణాలను ఆరాధించాలని లక్ష్మణ్రావ్జీ ఇనాందార్ తనకు నేర్పించారని మోడీ అన్నారు. మనుషుల రూపంలో ఉన్న దేవుణ్ని దర్శించుకోడానికి నాకు ‘మన్‌కీ బాత్’ అవకాశం కల్పించిందన్నారు. ‘మన్‌కీ బాత్’లో ప్రస్తావించిన ప్రతి ఒక్కరూ మన హీరోలేనని, వారంత ఈ రేడియో కార్యక్రమానికి జీవం పోశారని ప్రధాని తెలిపారు. ఈసారి మన్‌కీ బాత్‌లో విశాఖపట్నంకు చెందిన వెంకటేశ్ ప్రసాద్‌ను గుర్తు చేసుకున్నారు. ఆయన దేశీయ వస్తువులను మాత్రమే వినియోగించేలా చార్ట్‌ను ఎలా రూపొందించారో తెలిపారు. తద్వారా స్వదేశీ వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు.