మొహాలి: ఐపిఎల్‌లో భాగంగా శుక్రవారం జరిగే కీలక పోరులో లక్నో సూపర్‌జెయింట్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకమనే చెప్పాలి. ప్రస్తుతం రెండు జట్లు నాలుగేసి విజయాలు సాధించాయి. అయితే మెరుగైన రన్‌రేట్ సాధించిన లక్నో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో గెలిస్తే పంజాబ్ పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానానికి చేరుకుంటుంది. పంజాబ్‌తో పోల్చితే లక్నో చాలా బలంగా ఉందనే చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో లక్నో పటిష్టంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. అయితే గుజరాత్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో లక్నో 136 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సయితం ఛేదించలేక పోయింది.
భారీ ఆశలతో పంజాబ్ కింగ్స్
మరోవైపు ఆతిథ్య పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్‌లో భారీ ఆశలతో బరిలోకి దిగుతోంది. కిందటి మ్యాచ్‌లో ముంబైను ఓడించడంతో పంజాబ్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. లక్నో మ్యాచ్‌లోనూ విజయం సాధించి ప్లేఆఫ్ అవకాశాలను మరింత మెరుగు పరుచుకోవాలని పంజాబ్ భావిస్తోంది. మాథ్యూ షార్ట్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, లివింగ్‌స్టోన్, హర్‌ప్రీత్ సింగ్, సామ్ కరన్, జితేష్ శర్మ, షారుక్ ఖాన్ తదితరులతో పంజాబ్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక అర్ష్‌దీప్, రాహుల్ చాహర్, లివింగ్‌స్టోన్, నాథన్ ఎల్లిస్, కరన్‌లతో బౌలింగ్ విభాగం కూడా బాగానే కనిపిస్తోంది. ఇలాంటి స్థితిలో లక్నోతో జరిగే మ్యాచ్‌లో పంజాబ్‌కు కూడా గెలుపు అవకాశాలు బాగానే ఉన్నాయని చెప్పాలి.









