AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బెంగళూరు కంపెనీ సంచలన ప్రకటన..! ఆ 4 రాష్ట్రాల పురుషులకు ఉద్యోగాలు బంద్..!

బెంగళూరుకు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పురుష అభ్యర్థులను తమ సంస్థలో ఇకపై ఉద్యోగంలోకి తీసుకోబోమని ‘A1 స్పోర్ట్స్ వరల్డ్’ వ్యవస్థాపకుడు కార్తీక్ ఎస్‌జీ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే, ఇది వివక్షాపూరిత చర్య అంటూ నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

ఈ వివాదాస్పద నిర్ణయం వెనుక గల కారణాలను కూడా కార్తీక్ వివరించారు. కొన్ని వారాల క్రితం, తమ సంస్థలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి… మహిళా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు, ఒక సహోద్యోగిపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆయన ఆరోపించారు. పలుమార్లు హెచ్చరించినా అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఉద్యోగం నుంచి తొలగించామని, ఆ ఉద్యోగి ఈ నాలుగు రాష్ట్రాలలో ఒకదానికి చెందినవాడని తెలిపారు. “ఇలాంటి మనస్తత్వం ఉన్న పురుషులకు అసలు అవకాశం ఇవ్వాలా?” అని ఆయన ప్రశ్నించారు.

న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన కథనం ప్రకారం, సంస్థలోని కీలక నిర్ణయాలు తీసుకునేవారితో సుదీర్ఘ చర్చలు, వాగ్వాదాల తర్వాతే ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని కార్తీక్ స్పష్టం చేశారు. తమ సంస్థలో ఇప్పటికే రాజస్థాన్‌కు చెందిన ఒక మహిళా ఉద్యోగి పనిచేస్తున్నారని, ఆమె కూడా ఈ నిర్ణయానికి 100 శాతం మద్దతు తెలిపిందని పేర్కొన్నారు.

తన నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తడంతో కార్తీక్ మరో పోస్ట్ ద్వారా వివరణ ఇచ్చారు. తమ సంస్థలో మొత్తం 32 మంది ఉద్యోగులు ఉండగా, వారిలో 14 మంది మహిళలు ఉన్నారని, దేశంలోని వివిధ రాష్ట్రాలు, మతాలకు చెందిన వారు పనిచేస్తున్నారని తెలిపారు. అయితే, ఒక వ్యక్తి చేసిన తీవ్రమైన తప్పునకు మొత్తం నాలుగు రాష్ట్రాల యువతను బాధ్యులను చేస్తూ తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర విమర్శలకు దారితీసింది. మహిళా ఉద్యోగుల భద్రత కోసం తీసుకున్నామని చెబుతున్నప్పటికీ, ఈ ప్రాంతీయ వివక్షాపూరిత నిర్ణయం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ANN TOP 10