AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

22ఏ భూములపై కీలక నిర్ణయం.. రిజిస్ట్రేషన్లకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్..

రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22ఏ కింద నిషేధిత జాబితాలో చేరిన భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వేలాది మంది ఆస్తి యజమానులకు భారీ ఊరట కల్పించింది. 22ఏ జాబితాలో ఉన్నప్పటికీ… జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ వంటి సంస్థల నుంచి అనుమతులు పొందిన లేఅవుట్లు, భవనాలకు రిజిస్ట్రేషన్లు చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేయగా, అవి తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

సాంకేతిక కారణాలు లేదా రెవెన్యూ వర్గీకరణల వల్ల 22ఏ జాబితాలో చేరినప్పటికీ, చట్టబద్ధమైన ప్రణాళికా సంస్థల నుంచి అనుమతులు ఉంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయంతో ఇప్పటివరకు రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన ఆస్తుల యజమానులు ఇకపై నేరుగా తమ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకోవడమే కాకుండా, ఇతరులకు బదిలీ చేసేందుకు కూడా మార్గం సుగమమైంది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాల్లోని అనేక హౌసింగ్ కాలనీల నివాసితులకు ఈ నిర్ణయం పెద్ద ఉపశమనం కలిగించనుంది. చాలాకాలంగా స్తంభించిపోయిన స్థిరాస్తి లావాదేవీలు తిరిగి ఊపందుకుంటాయని భావిస్తున్నారు.

ఈ ప్రయోజనం పొందాలనుకునే యజమానులు సంబంధిత పత్రాలతో అధికారులకు దరఖాస్తు చేసుకుని, తమ ఆస్తులపై ఉన్న రిజిస్ట్రేషన్ ఆంక్షలను తొలగించుకోవచ్చని రెవెన్యూ శాఖ సూచించింది.

మరోవైపు, 22ఏ భూముల అంశంపై అసెంబ్లీలో జరిగిన చర్చ అనంతరం ప్రభుత్వం ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో రాజీవ్‌గాంధీ హనుమంతు, సందీప్‌కుమార్ ఝా సభ్యులుగా ఉంటారు. ఆయా జిల్లాల కలెక్టర్లు కూడా ఈ కమిటీలో భాగస్వాములుగా ఉంటారు. 22ఏ భూముల విషయంలో జరిగిన అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై ఈ కమిటీ విచారణ చేపట్టనుంది. ఈ కమిటీ పరిధి కేవలం 22ఏ అంశానికే పరిమితం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ANN TOP 10