ఐటీ కంపెనీల్లో లేఆఫ్స్ జరుగుతున్న సమయంలో.. హైదరాబాద్ గచ్చిబౌలి ఏరియాలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ ఏకంగా బోర్డు తిప్పేసింది. కంపెనీలో పని చేస్తున్న 700 మంది ఉద్యోగులను రోడ్డున వేసింది. ఉద్యోగం అయితే పోయింది అనుకోవటానికి వీల్లేని దుస్థితి ఇక్కడ.. ఎందుకంటే ఉద్యోగుల పేరుతో కంపెనీ అప్పులు తీసుకోవటం మరో ట్వి్స్ట్. కంపెనీ ఎత్తేయటంతో.. ఉద్యోగులే ఆ అప్పులు చెల్లించాల్సిన దుస్థితి. చిత్ర, విచిత్రంగా సాగిన ఈ సాఫ్ట్ వేర్ కంపెనీ బాగోతం సంచలనంగా మారింది.
గచ్చిబౌలిలోని ఇన్ఫోసి కంపెనీ నిర్వాకం బయట పడటంతో.. ఏప్రిల్ 18వ తేదీ మంగళవారం ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు ఉద్యోగులు. 20 నెలలుగా జీతాలు చెల్లించకపోగా.. ఇప్పుడు ఏకంగా కంపెనీ మూసివేయటం ఏంటని నిలదీశారు. ఉద్యోగులను టెర్మినేట్ చేస్తూ కంపెనీ ఈ మెయిల్స్ పంపిందని.. అయితే 650 మంది పేరున ఒక్కొక్కరిపై నాలుగు లక్షల రూపాయిలు, 50 మంది ఉద్యోగుల పేరుతో ఒక్కొక్కరి పేరుపై 10 లక్షల రూపాయలు కంపెనీ యాజమాన్యం లోన్ తీసుకుందని.. ఇప్పుడు మేం వాటిని ఎలా చెల్లించాలని ఆందోళన చేస్తున్నారు.
గచ్చిబౌలి ప్రముఖ ఇన్ఫోసి కంపెనీ భారీసంఖ్యలో ఉద్యోగుల తొలగింపు హైటెక్ సిటీలో కలకలం రేపుతోంది. ఇప్పటికే లేఆఫ్స్ తో గందరగోళంలో ఉన్న ఐటీ ఉద్యోగులకు.. చిన్న ఐటీ కంపెనీల బాగోతాలు బయటపడుతుండటంతో.. మరింత ఆందోళన చెందుతున్నారు. ఒక్కసారిగా హైదరాబాద్ లోని 700 మంది ఐటీ ఉద్యోగులు రోడ్డున పడటం చర్చనీయాంశం అయ్యింది. ఉద్యోగుల పేరుతో తీసుకున్న అప్పులు ఎవరు చెల్లించాలనే ప్రశ్న ఇప్పుడు పెద్ద టాపిక్ అయ్యింది. అసలు ఉద్యోగులు ఎలా సంతకాలు చేశారు అనేది అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు.









