అందుబాటులోకి 60 ప్రత్యేక బస్సులు
ఐపీఎల్ అభిమానులకు టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ తెలిపింది. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా నేడు హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ముంబైతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. సాయంత్రం 7.30కు ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా.. ముంబై, హైదరాబాద్ జట్ల మధ్య జరిగే రసవత్తర పోరును ప్రత్యక్షంగా చూసేందుకు క్రికెట్ అభిమానులు భారీగా స్టేడియంకు రానున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని నలుమూలల నుంచి క్రికెట్ అభిమానులు మ్యాచ్ చూసేందుకు తరలిరానున్నారు.
ఈ క్రమంలో ఐపీఎల్ ప్రేక్షకులు ఉప్పల్ స్టేడియంకు సులువుగా చేరుకునేందుకు వీలుగా టీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను స్టేడియంకు నడుపుతోంది. దీంతో నేడు జరగనున్న ముంబై, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ సందర్భంగా ఏకంగా 60 ప్రత్యేక బస్సులను ఉప్పల్ స్టేడియానికి తిప్పనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.









