కొండా సురేఖ బర్తరఫ్ పై మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. కొండా సురేఖను బర్తరఫ్ చేయడం బాధాకరం అని అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుందని, నా చేతిలో ఏమీ లేదు అని అన్నారు. గతంలో రెండుసార్లు ఫిర్యాదులు వచ్చినప్పుడు ముఖ్యమంత్రితో మాట్లాడానని కానీ ఇప్పుడు పార్టీకి, ప్రభుత్వానికి నష్టం తెచ్చే విధంగా వ్యవహరించారు కాబట్టే కఠిన చర్యలు తీసుకున్నారని అన్నారు. ఎవరు ఇకపై క్రమశిక్షణ ఉల్లంఘించిన ఇదే రీతిలో చర్యలు తప్పవని హెచ్చరించారు.
క్రమశిక్షణ సంఘం ఇచ్చిన రిపోర్టు ఆధారంగానే కొండా సురేఖ, చిన్నారెడ్డి లపై చర్యలు తీసుకున్నారని, ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని నమ్ముకున్న పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. ఎస్సీలు ఎస్టీలు, బీసీలు మైనార్టీలకు అవకాశం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే కచ్చితంగా అవకాశం ఇస్తామని అన్నారు. కొండా సురేఖ నిన్న ఆవేశం ఆవేదనతో మాట్లాడారు. ఇకపై ఆ విధంగా మాట్లాడొద్దని సూచిస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సమస్య ఉంటే ఎవరైనా సరే పీసీసీ, జనరల్ సెక్రెటరీతో రాహుల్ గాంధీతో కూడా మాట్లాడవచ్చు అని అన్నారు.
బహిరంగ వేదికలపై విమర్శలు వద్దు.. దీనిని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కాంగ్రెస్ పార్టీ కఠినంగా ఉంటుందని తెలిపారు. హద్దులు దాటి మాట్లాడితే చర్యలు తప్పవు అనేది గుర్తించుకోవాలని, కొండా సురేఖ హద్దులు దాటారు నేను ఆపే పరిస్థితి ఉండదని అన్నారు. గతంలో రెండుసార్లు ఆమెకు అవకాశం ఇచ్చాం. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నివేదిక ఆధారంగా హై కమాండ్ నిర్ణయం తీసుకుందని క్లారిటీ ఇచ్చారు. చిన్నా రెడ్డి, కొండా సురేఖ పై సమాన చర్యలు తీసుకుందని, క్రమశిక్షణ ఎవరు ఉల్లంఘించిన ఎంత పెద్ద వారైనా కులమతాలకు సంబంధం లేకుండా చర్యలు ఉంటాయన్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో వెయ్యి రోజుల పాలన విజయాలపై చర్చలకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. కెసిఆర్ ఫామ్ హౌస్‌కి పరిమితం కాకుండా అసెంబ్లీకి రావాలి. కెసిఆర్ అనుభవాలు పంచుకోవాలి తన వాదన వినిపించాలని అన్నారు. ఫామ్ హౌస్‌కి పరిమితం కావడం వల్ల ప్రతిపక్ష నేత హోదా అర్థం లేకుండా పోతుందని అన్నారు. వెయ్యి రోజుల పండుగ ఘనంగా చెప్పుకోవడానికి కారణాలు ఉన్నాయి. మా నెత్తిన అప్పులు పెట్టి వెళ్లిపోయారు. అయినా ప్రజలకు సంక్షేమం అందిస్తున్నామని అన్నారు. హామీలన్నీ అమలు చేస్తున్నాం.. ఇవి కూడా ఇస్తున్నామని, అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని అన్నారు.
తెలంగాణలో ఊహించనటువంటి అభివృద్ధి జరుగుతుంది. టాబ్లెట్ విస్తరణలో అన్ని జిల్లాల నేతలకు ప్రాతినిధ్యం ఉంటుంది. గెలిచిన వాళ్ళందరూ మంత్రుల అవ్వాలని కోరుకుంటారు. అందరికీ మంత్రి పదవి ఇవ్వడం సాధ్యం కాదని అన్నారు. ఎన్నో సమీకరణాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుందని, సీనియర్లకు అవకాశం ఇవ్వాలని హై కమాండ్‌ను మేము కోరామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రానున్న ఎన్నికల కోసం సీనియర్లందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు దాటుతామని, జిల్లాలకు ప్రాధాన్యత ఉండాలని కోరుకునే వాళ్లలో మొదటి వ్యక్తిని నేనని అన్నారు. మంత్రివర్గ విస్తరణ పై హై కమాండ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలని అన్నారు.








