AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేబినెట్‌లో మార్పులు అవసరం..! గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు చేపట్టాల్సిన అవసరం ఉందని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ ద్వారా ప్రభుత్వం పనితీరులో నూతనోత్తేజం వస్తుందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలను అరికట్టి, క్రమశిక్షణను కఠినంగా అమలు చేయాలని సూచించారు.

ప్రస్తుతం రాజకీయ పార్టీలలో క్రమశిక్షణ కొరవడిందని గుత్తా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలోని గ్రూపు రాజకీయాలకు స్వస్తి పలకాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. సీనియర్ నేత చిన్నారెడ్డి పార్టీ నియమావళిని అతిక్రమించి మాట్లాడటం సరికాదని, హద్దులు దాటే వారిపై చర్యలు తీసుకోకపోతే పార్టీకే నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం, పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో సమాచార లీకేజీలను అదుపు చేయాలని ఆయన కోరారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువకుడు, ఉత్సాహవంతుడని, ఆయనకు ఎటువంటి ఆటంకాలు సృష్టించకుండా స్వేచ్ఛగా పనిచేసే అవకాశం కల్పించాలని గుత్తా సుఖేందర్ రెడ్డి హితవు పలికారు. ప్రస్తుతం ప్రభుత్వంపై సామాన్య ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగిస్తూనే, ప్రభుత్వం నూతన పథకాలను అమలు చేస్తోందని, అయితే ప్రభుత్వ కార్యక్రమాలకు మరింత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. సంక్షేమ పథకాలపై స్పందిస్తూ, ప్రస్తుతం ఇస్తున్న పింఛన్లను రూ. 3,000కు పెంచాలని, 22A నిబంధనను రద్దు చేసి సంబంధిత సమస్యలను పరిష్కరించాలని కోరారు. అలాగే ఉచిత పథకాలను క్రమంగా తగ్గించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.

ANN TOP 10