AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రూ.250 కోట్లతో ట్రైబల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్..! దేశానికే గేమ్ ఛేంజర్.. సీఎం చంద్రబాబు.

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సంజీవని కార్యక్రమం’ రాష్ట్రంలోనూ, దేశంలోనూ గేమ్ ఛేంజర్ గా మారుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. అరకు నియోజకవర్గంలోని గన్నెలి ప్రాంతంలో సంజీవని కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం అక్కడి సభలో చంద్రబాబు మాట్లాడారు. గతంలోనే ఆయుర్వేద వైద్యాన్ని గిరిజనులకు అల్లూరి సీతారామరాజు అందించారన్న చంద్రబాబు.. అలాంటి మహనీయుడిని నిత్యం స్మరించుకునేందుకు కొత్తగా నిర్మించిన ఎయిర్ పోర్టుకు అల్లూరి పేరు పెట్టినట్లు గుర్తు చేశారు.

మారుమూల గిరిజన ప్రాంతాల్లోని ప్రతి కుటుంబానికీ నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నట్లు చంద్రబాబు అన్నారు. కొండ ప్రాంతాల్లోని వారు వైద్య సేవల కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి ఉండకూడదని అన్నారు. దీని కోసమే సంజీవని కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇప్పటికే కుప్పం నియోజకవర్గంలో, చిత్తూరు జిల్లాలో సంజీవని ప్రాజెక్టును అమలు చేస్తున్నామని అన్నారు.

అనారోగ్యం వస్తే విశాఖ, పాడేరుకు వెళ్లాల్సిన అవసరం లేదన్న సీఎం.. ఫోన్ లోనే ఆరోగ్యాన్ని చెక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఏజెన్సీ ఏరియాల్లో మరికొన్ని సెల్ టవర్లు పెట్టించి కనెక్టివిటీని పెంచుతామని హామీ ఇచ్చారు. 3 నెలల్లో ఇక్కడి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మెరుగుపరుస్తానని హామీ ఇచ్చారు. ఏ వైద్యమైనా అక్కడే చేయించుకునేలా ఏర్పాట్లు చేస్తామని భరోసా కల్పంచారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని రోగుల రక్త నమూనాలను పెద్ద ఆస్పత్రికి పంపేందుకు డ్రోన్ టెక్నాలజీని ఉపయోగిస్తామని చంద్రబాబు అన్నారు.

మరోవైపు గిరిజన ప్రాంతాల్లో ఏ కుటుంబమూ పేదరికంలో ఉండకూడదన్నదే తమ ప్రభుత్వ ఆలోచన అని చంద్రబాబు అన్నారు. ఐదు సూత్రాలతో గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు చేశామని తెలిపారు. అడవితల్లి బాట పేరుతో రూ.1000 కోట్లతో 900 కిలోమీటర్ల రహదారులు వేశామన్నారు. 1.60 లక్షల ఇళ్లకు కుళాయి ద్వారా నీరు, సోలార్ రూఫ్ టాప్ ను కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గిరిజన ప్రాంతాల్లో ఉపాధి పెరిగేలా అరకు కాఫీని మరో లక్ష ఎకరాల్లో సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. వచ్చే మూడేళ్లలో లక్ష మంది గిరిజిన యువతకు నైపుణ్య శిక్షణ కల్పించాలన్నది తన ఆలోచనగా పేర్కొన్నారు.

ప్రతి గిరిజన బిడ్డ అందరిలా ఆరోగ్యంగా ఎదగాలని చంద్రబాబు ఆకాంక్షించారు. అందుకే సంజీవని కార్యక్రమం ఇక్కడికి తెచ్చినట్లు చెప్పారు. ‘గిరిజన ప్రాంతాల్లో ప్రతి కుటుంబ జీవన ప్రమాణాలు మెరుగుపడాలి. అదే నిజమైన అభివృద్ధి. గిరిజన ప్రాంతాలకు మంచి వైద్య సేవలు అందేలా రూ.250 కోట్లతో ట్రైబల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీషన్ మిషన్ తెస్తున్నాం. సికిల్ సెల్, తలసేమియా బాధితులకు నెలకు రూ.10,000 పెన్షన్ అందిస్తున్నాం. గిరిజన బిడ్డలు దేశంలోని అత్యుత్తమ విద్యాసంస్థల్లో చదవాలి. అందుకే IIT మద్రాస్‌తో ఒప్పందం చేసుకున్నాం. IIT, NEET వంటి పరీక్షలకు ప్రత్యేక కోచింగ్ అందిస్తున్నాం’ అని అరకు సంజీవని సభలో చంద్రబాబు చెప్పుకొచ్చారు.

ANN TOP 10