మహర్షి వాల్మీకి ఎస్టీ అభివృద్ధి సంస్థలో వెలుగుచూసిన రూ.89 కోట్ల అక్రమాల ఆరోపణలు కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. విపక్ష బీజేపీ నుంచి వస్తున్న ఒత్తిళ్లకు తలొగ్గి కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రణాళిక – సంఖ్యాశాఖ మంత్రి బి. నాగేంద్ర తన పదవికి రాజీనామా చేశారు. విలేకరుల సమావేశంలో తన రాజీనామాను ప్రకటిస్తూ ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రివర్గం నుంచి ఆయన తప్పుకోవడం స్వల్ప వ్యవధిలోనే ఇది రెండోసారి కావడం గమనార్హం.
మే 2024లో వాల్మీకి కార్పొరేషన్ అకౌంట్స్ ఆఫీసర్ చంద్రశేఖరన్. పి ఆత్మహత్య చేసుకోవడంతో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సంస్థ ఖాతాల నుంచి పెద్దమొత్తంలో నిధులు అక్రమంగా ఇతర ఖాతాలకు మళ్లాయంటూ ఆయన ఒక సూసైడ్ నోట్ రాసి ప్రాణాలు తీసుకున్నారు. దీనిపై వివాదం చెలరేగడంతో అప్పట్లో సిద్ధరామయ్య కేబినేట్‌లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న నాగేంద్ర.. 2024 జూన్ లో మొదటిసారి రాజీనామా చేశారు. ఆ తర్వాత సిద్ధరామయ్య స్థానంలో డి.కె. శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆగస్టు మొదటి వారంలో నాగేంద్రకు మళ్లీ మంత్రివర్గంలో చోటు దక్కింది. అయితే ప్రతిపక్షాల ఆందోళనలు తీవ్రతరం కావడంతో నెల తిరక్కుండానే ఆయన మళ్లీ పదవిని వీడాల్సి వచ్చింది.
తన రాజీనామా వెనుక కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడేమీ లేదని బి. నాగేంద్ర ప్రెస్ మీట్ లో స్పష్టం చేశారు. తన సొంత నిర్ణయంతోనే తప్పుకుంటున్నానని స్పష్టం చేశారు. ‘నాపై వచ్చిన ఆరోపణలపై అసెంబ్లీలో చర్చకు రావాలని బీజేపీ నేతలను ఎన్నిసార్లు కోరినా వారు రాలేదు. నాపై నేరం మోపడానికి వారి వద్ద ఏం ఆధారాలు ఉన్నాయి?’ అని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగంపై తనకు పూర్తి నమ్మకం ఉందన్న ఆయన.. బీజేపీకి గిరిజను వ్యతిరేక మనస్తత్వం ఉందని ఆరోపించారు. అందుకే దళిత, ఎస్టీ నాయకుడైన తనను లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని ఆయన కన్నీటి పర్యంతం అయ్యారు.
వాస్తవానికి సెప్టెంబర్ 1 నుంచి 10 వరకు రాయచూరు నుంచి బళ్లారి వరకు 200 కిలోమీటర్ల మేర 10 రోజుల పాటు ‘పాదయాత్ర’ చేపడుతున్నట్లు కర్ణాటక బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించనున్న ఈ యాత్రలో నాగేంద్ర అక్రమాలను ప్రధాన అంశాలుగా తీసుకెళ్లాలని బీజేపీ భావించింది. ఈ పాదయాత్రలో తన రాజీనామా అంశం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారకూడదనే ఉద్దేశంతోనే తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్లు నాగేంద్ర తెలిపారు. ఇదిలా ఉంటే నాగేంద్ర గతంలో బీజేపీలో పనిచేశారు. 2018లో కాంగ్రెస్ లో చేరి బళ్లారి నుంచి వరుసగా 2 సార్లు విజయం సాధించారు.







