రేపు రాఖీ పండుగ నేపథ్యంలో తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత తన సోదరుడు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడికి రాఖీ కట్టే అవకాశం మరోసారి దక్కకపోవడంపై ఆమె తీవ్ర ఆవేదన, అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆడబిడ్డగా తన ఆత్మగౌరవం దెబ్బతిన్నదని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.
గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, రాఖీ పండుగ ప్రస్తావన రాగా కవిత భావోద్వేగానికి గురయ్యారు. “ఈసారి కేటీఆర్‌కు రాఖీ కడతారా?” అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆమె స్పందిస్తూ, “పోయినసారి అడిగితే ఆయన ఊర్లో లేకుండా పారిపోయారు. ఈసారి అడగకుండానే ఏకంగా విదేశాలకు వెళ్లిపోయారు. ఆడబిడ్డలమైన మాకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది కదా? మా ఆత్మగౌరవం చాలా తీవ్రంగా దెబ్బతింది” అని ఆవేదనతో అన్నారు. రాఖీ అంటే రక్త సంబంధమని, దాన్ని రాజకీయాలతో ముడిపెట్టకూడదని ఆమె హితవు పలికారు.
రాఖీ విషయంలో తన అసంతృప్తిని వెళ్లగక్కడంతోనే కవిత ఆగలేదు. బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు. హరీశ్ రావు, బీజేపీ-ఆర్ఎస్ఎస్ మద్దతుతో బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇందుకోసం మెదక్‌లో రహస్య సమావేశాలు కూడా నిర్వహించారని అన్నారు. “నా సోదరుడు కేటీఆర్ చాలా అమాయకుడు, అందుకే నన్ను ఒక పథకం ప్రకారం పార్టీ నుంచి బయటకు పంపించారు” అని కవిత ఆరోపించారు.
బీఆర్ఎస్‌లో ప్రస్తుతం తీవ్ర అంతర్గత సంక్షోభం నడుస్తోందని, అందుకే ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఆమె విమర్శించారు. పార్టీలో నెలకొన్న ఈ సంక్షోభం కారణంగానే ప్రజల పక్షాన నిలబడటంలో విఫలమవుతున్నారని అన్నారు. ప్రజలు ఈ విషయాలను గమనించి, తమలాంటి వారిని ఆశీర్వదించాలని కోరారు. .









