నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్రం విఫలమైందని ఆరోపిస్తూ.. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) మరోమారు ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 5న దేశ రాజధాని ఢిల్లీలో మరోమారు శాంతియుత నిరసనలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
సెప్టెంబర్ 5న ఢిల్లీలోని చారిత్రాత్మక ఇండియా గేట్ వద్ద ప్రారంభమయ్యే ఈ శాంతియుత ర్యాలీ.. అక్కడి నుంచి న్యూఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు కొనసాగుతుందని తెలిపింది. దేశంలోని యువత, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొంది.
ఈ సందర్భంగా కేంద్రంపై సీజేపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ‘ఒక తరం నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని, వారిని ఇళ్లకు పంపించేసి, ఆ తర్వాత ఇచ్చిన మాట నుంచి ప్రభుత్వం సైలెంట్‌గా వెనక్కి తగ్గడం ఎంతమాత్రం సరికాదు. ఇచ్చిన మాటను దాటవేసే ఈ నమ్మకద్రోహాన్ని మేము ఏమాత్రం సహించబోము’ అని పార్టీ స్పష్టం చేసింది.
ఈసారి చేపట్టబోయే నిరసనలను బాధితులే ముందుండి నడిపిస్తారని సీజేపీ వెల్లడించింది. నీట్ పేపర్ లీకేజీ కారణంగా తమ పిల్లలను, వారి భవిష్యత్తును కోల్పోయిన కుటుంబాలు, అలాగే పోలీసుల దౌర్జన్యాలకు గురైన బాధితులు స్వయంగా ఈ మార్చ్‌కు నాయకత్వం వహిస్తారని పార్టీ తెలిపింది. న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేసింది.








