AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

30 ఏళ్ల నిరీక్షణకు తెర..! వెలిగొండ నిర్వాసితులకు రూ.250 కోట్ల చెక్కుల పంపిణీ..! ఎప్పుడంటే..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రూ. 250 కోట్ల పరిహారం చెక్కును అందజేశారు. దశాబ్దాలుగా నలుగుతున్న ఈ డ్రింకింగ్ , సాగునీటి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి.. ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రాజెక్టు వల్ల ఇల్లు, స్థలాలు కోల్పోయిన కుటుంబాలకు పునరావాసం కల్పించడంతో పాటు ఆర్థికంగా చేయూత అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.

అసాధ్యమనుకున్న వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని సుసాధ్యం చేసి చూపించామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 1996లో తానే ఈ ప్రాజెక్టుకు శిలాఫలకం వేశానని, ఇప్పుడు ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గత రెండేళ్ల కాలంలోనే రూ. 2,250 కోట్లు ఖర్చు చేసి పనులను పరుగులు తీయించామని తెలిపారు. ఈ నెల 31వ తేదీన వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను అధికారికంగా ప్రారంభించి, ఆ ప్రాంత రైతుల దశాబ్దాల నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపబోతున్నట్లు ప్రకటించారు.

ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో 50 శాతం లోటు వర్షపాతం నమోదైందని, శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలకు ఆశించిన స్థాయిలో నీరు చేరలేదని సీఎం గుర్తుచేశారు. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రాజెక్టును పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నామన్నారు. పోలవరం పూర్తి చేసి కృష్ణా డెల్టాను స్థిరీకరిస్తే, శ్రీశైలంలో ఆదా అయ్యే నీటిని ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప , రాయలసీమ జిల్లాలకు మళ్లించవచ్చని తెలిపారు. జాతీయ స్థాయిలో గంగా-గోదావరి-కావేరి సహా ఐదు నదులను అనుసంధానిస్తే దేశంలో నీటి భద్రత లభిస్తుందని సదరన్ జోనల్ కౌన్సిల్ భేటీలో ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు.

ప్రాజెక్టు నిర్వాసితుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలిపిన ముఖ్యమంత్రి, మార్కాపురం జిల్లా పరిధిలోని ప్రతి ఇంటికీ జల్ జీవన్ మిషన్ ద్వారా టాప్ కనెక్షన్ ఇచ్చి సురక్షిత తాగునీరు అందిస్తామన్నారు. దీనికి సంబంధించి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. అలాగే రైతుల ఆదాయాన్ని పెంచేందుకు సెప్టెంబరులో హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సూపర్‌సిక్స్ పథకాలను అమలు చేస్తూనే, సంక్షేమాన్ని, అభివృద్ధిని సమతుల్యం చేస్తున్నామని, ప్రజానుకూల ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు.

ANN TOP 10