చీరాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సాధించిన విజయాన్ని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశంసించారు. ఈ ఫలితాల్లో కీలక పాత్ర పోషించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు ఆమె హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
44 స్థానాల్లో భాగంగా కాంగ్రెస్ 42 చోట్ల అభ్యర్థులను నిలబెట్టింది. వారిలో 10 మందిని గెలిపించడంతో పాటు, మిగతా స్థానాల్లోనూ పార్టీని రెండో స్థానంలో నిలబెట్టడంలో ఆమంచి ప్రత్యక్షంగా కృషి చేశారని షర్మిల పేర్కొన్నారు.
“కాంగ్రెస్ సారథ్యంలో చీరాలలో అభ్యర్థుల గెలుపు మీ కష్టానికి దక్కిన ప్రతిఫలం. స్థానికంగా ప్రజా సమస్యలపై మీ అకుంఠిత పోరాట పటిమకు నిదర్శనం” అని ఆమె అన్నారు. చీరాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం నిజమైన ప్రజాస్వామ్య విజయమని, రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీనే ఇక ప్రత్యామ్నాయమనడానికి ఇదొక సంకేతమని ఆమె వ్యాఖ్యానించారు.
ప్రజల గొంతుకను నొక్కిపట్టాలని చూసిన కూటమి శక్తులను ఎదురించి, అధికార బలాన్ని తట్టుకుని, ప్రలోభాలకు లొంగకుండా ప్రజా పక్షాన నిలిచి గెలిచిన వార్డు సభ్యులను షర్మిల అభినందించారు. అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలకు, కాంగ్రెస్ అభ్యర్థులను నమ్మి ఓటేసిన చీరాల ప్రజలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
మున్సిపాలిటీ పీఠాన్ని కైవసం చేసుకోలేకపోయినా, గౌరవప్రదమైన స్థానాలు దక్కించుకుని ప్రతిపక్ష పాత్ర పోషించబోతున్న కాంగ్రెస్‌దే చీరాలలో అసలైన నైతిక విజయమని ఆమె అన్నారు.
చీరాల ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ, కూటమి నిర్లక్ష్యాన్ని ఎప్పటికప్పుడు ఎండగట్టేలా అసలైన ప్రతిపక్ష పాత్ర పోషించాలని ఆమె సూచించారు. గెలుపొందిన కాంగ్రెస్ వార్డు సభ్యులు అంకితభావంతో పనిచేస్తారని ఆశిస్తున్నట్లు షర్మిల తెలిపారు.








