AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఒకటి కాదు రెండు కాదు.. 70కి పైగా అవమానాలు భరించ..! వైసీపీ పై విజయ్ సాయి రెడ్డి సంచలన వాఖ్యలు..

రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి వైసీపీ అధినేత జగన్ పై మరోసారి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. తాను స్థాపిస్తున్న కొత్త పార్టీలో పలువురు నాయకులు చేరుతున్న సందర్భంగా విజయసాయిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ నుంచి తనను జగన్ అవమానించి బయటకు పంపించారని, పొమ్మనకుండా పొగబెట్టారని సంచలన ఆరోపణలు చేశారు.

ఈ నెల 11వ తేదీన తన కొత్త పార్టీ ఆవిర్భావం ఉంటుందని స్పష్టం చేశారు. కొత్త పార్టీలో చేరికలను స్వాగతించారు. విశ్వ హిందూ పరిషత్‌లో దశాబ్దాలుగా పనిచేసిన సుమతి రెడ్డి, అనకాపల్లికి చెందిన హిందూ ఎస్సీ, ఎస్టీ కులాల పరిరక్షణ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు బోని గణేశ్ తమ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. సుమతి రెడ్డి రాబోయే ఎన్నికల్లో తిరుపతి జిల్లా నుంచి శాసనసభకు పోటీ చేస్తారని, నియోజకవర్గాన్ని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. ఈ చేరికలు తమ పార్టీ సిద్ధాంతానికి నిదర్శనమని, అన్ని కులాలు, మతాలు, వర్గాలకు సమన్యాయం చేయడమే తమ లక్ష్యమని ఆయన ఉద్ఘాటించారు. “రాష్ట్రాన్ని రెండు కుటుంబాల చేతుల్లో పెట్టకూడదు. రాజ్యాంగబద్ధంగా ఎవరి హక్కులు వారికి దక్కాలి. యువతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, అంతర్గత ప్రజాస్వామ్యంతో మా పార్టీ నడుస్తుంది” అని ఆయన వివరించారు.

జగన్ నన్ను బయటకు గెంటేశారు

వైసీపీ నుంచి బయటకు రావడానికి గల కారణాలను వివరిస్తూ ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. “నేను పార్టీని వదిలి వెళ్ళలేదు, నన్ను బయటకు తోసేశారు. పొమ్మనకుండా పొగబెట్టి, అప్పుడప్పుడు అవమానించి, ఒక మనిషిగా భరించలేనటువంటి పరిస్థితులు కల్పించారు. అందుకే ఆ పార్టీని వీడాల్సి వచ్చింది. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు నన్నెప్పుడూ అవమానించలేదు. కానీ జగన్ పాలనలోనే ఇది జరిగింది. చెప్పుడు మాటలు విని నన్ను దూరం పెట్టారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఒకటి రెండు కాదు, 70కి పైగా అవమానాలను భరించానని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే పనులు చేస్తే ఎవరైనా ఎలా ఊరుకుంటారని ప్రశ్నించారు. “ప్రతి మనిషికీ ఆత్మగౌరవం ఉంటుంది. నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినప్పుడు ఇక అక్కడ ఉండలేకపోయాను. కూర్చున్న కొమ్మను నరికేసినప్పుడు ఇంకేం చేయగలం? అందుకే బయటకు వచ్చాను” అని అన్నారు.

హిందూత్వ ముద్రపై స్పందన

పార్టీలో కాషాయ రంగు ప్రభావం ఎక్కువ అంటున్నారనే విమర్శపై విజయసాయిరెడ్డి స్పందిస్తూ, “మనం భారతమాత బిడ్డలం. మన అమ్మ గురించి మనం గొప్పగా చెప్పుకుంటాం. అలాగని ఇతరులను ద్వేషించం. భారతదేశంలోని ప్రతి క్రిస్టియన్, ముస్లిం వెనుక భారతీయ డీఎన్ఏ ఉంది. ఇది నిరూపితమైన సత్యం. మేము హిందూ ధర్మం గురించి మాట్లాడితే ఇతరులకు వ్యతిరేకం కాదు. అందరికీ సమన్యాయం చేయడమే మా పార్టీ ఉద్దేశం,” అని స్పష్టం చేశారు.

అధికారంలో ఉన్నామని విర్రవీగితే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ఏకపక్ష వైఖరి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని ఆయన విమర్శించారు. తాము పెట్టబోయే పార్టీలో ప్రతి ఒక్కరినీ గౌరవంగా చూసుకుంటామని, ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు వెళ్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర భవిష్యత్తును మార్చే మూడో ప్రత్యామ్నాయంగా తమ పార్టీ నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ANN TOP 10