త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 94 శాతానికి పైగా స్థానాలను కైవసం చేసుకోవాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో విజయం కోసం ఇప్పటినుంచే కష్టపడి పనిచేయాలని సూచించారు. అనంతపురం జిల్లా రాప్తాడులో స్వర్గీయ ఎన్టీఆర్, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర విగ్రహాలను ఆవిష్కరించిన అనంతరం జరిగిన సభలో లోకేశ్ మాట్లాడారు.
టీడీపీకి కోటి ఆరు లక్షల మంది సభ్యులు ఉన్నారని లోకేశ్ తెలిపారు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తమ కుటుంబంలో భాగమయ్యారని, బీజేపీ కూడా కూటమిలో కలిసి పనిచేస్తోందని చెప్పారు. మూడు పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్‌ను ముందుకు తీసుకెళ్తున్నాయని పేర్కొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని లోకేశ్ సూచించారు. ‘‘ఎన్నికలు.. తగ్గేదేలే’’ అంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. పార్టీ కోసం కష్టపడే వారిని గుర్తించి గౌరవిస్తామని చెప్పారు. ప్రజల్లో ఉంటూ వారికి సేవ చేయాలని సూచించారు.
కూటమిలో ఏవైనా సమస్యలు ఉంటే నాలుగు గోడల మధ్య కూర్చొని చర్చించుకుని పరిష్కరించుకోవాలని లోకేశ్ అన్నారు. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత అందరూ దానికి కట్టుబడి ఉండాలని సూచించారు. మూడు పార్టీలు కలిసికట్టుగా ముందుకు సాగితే రాష్ట్ర అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని చెప్పారు.
గతంలో పార్టీ కార్యకర్తలు ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తుచేసుకున్న లోకేశ్.. వారి కష్టాన్ని ప్రజా సేవ ద్వారా గౌరవించాలని పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 94 శాతానికి మించి స్థానాలు సాధించేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని కోరారు.








