వందేమాతరం గీతాన్ని ఆలపించలేదన్న కారణంతో వ్యక్తులపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మతపరమైన విశ్వాసాలు లేదా మనస్సాక్షికి సంబంధించిన కారణాలతో ఎవరైనా ఈ గీతాన్ని పాడటానికి నిరాకరిస్తే, వారిపై ఎటువంటి శిక్షార్హమైన చర్యలు ఉండబోవని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. అదే సమయంలో, జాతీయ గీతంగా వందేమాతరం హోదాను న్యాయస్థానాలు సమీక్షించలేవని కూడా స్పష్టం చేసింది.
ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు టీఎం కృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. వందేమాతరంలోని ఆరు చరణాలను ఆలపించాలన్న కేంద్ర ప్రభుత్వ సర్క్యులర్‌ను, అలాగే జాతీయ చిహ్నాలను అవమానించకుండా నిరోధించే చట్టం-2026 సవరణను టీఎం కృష్ణ సవాల్ చేశారు. గీతంలోని చివరి నాలుగు చరణాలలో హిందూ దేవతల ప్రస్తావన ఉండటం రాజ్యాంగబద్ధమైన లౌకిక స్ఫూర్తికి, మత స్వేచ్ఛకు విరుద్ధమని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
విచారణ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ, “వందేమాతరం సుదీర్ఘ కాలంగా జాతీయ గీతంగా కొనసాగుతోంది, దాని హోదాను మేము ప్రశ్నించలేము” అని వ్యాఖ్యానించింది. అయితే, ఆర్టికల్స్ 25, 26 ప్రకారం మత విశ్వాసాలు లేదా వ్యక్తిగత విచక్షణ కారణంగా ఎవరైనా ఈ గీతాన్ని పాడటానికి అభ్యంతరం వ్యక్తం చేస్తే, వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. వ్యక్తులు తమ ఇష్టానుసారం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ చరణాలను పాడవచ్చని లేదా అస్సలు పాడకుండా ఉండవచ్చని కోర్టు అభిప్రాయపడింది.
1986 నాటి చరిత్రాత్మక బిజో ఇమ్మాన్యుయేల్ కేసులో, మత విశ్వాసాల కారణంగా జాతీయ గీతాన్ని పాడలేమని కోరిన జెహోవా సాక్షుల విభాగానికి చెందిన విద్యార్థులకు సుప్రీంకోర్టు రక్షణ కల్పించిన విషయాన్ని ఈ సందర్భంగా ధర్మాసనం గుర్తు చేసింది. ప్రాథమిక హక్కులను ప్రాథమిక విధులు అధిగమించలేవని ఆ తీర్పు స్పష్టం చేసిందని పేర్కొంది. ప్రస్తుత పిటిషన్‌లో కేవలం క్రిమినల్ చర్యలకు సంబంధించిన అంశాన్ని మాత్రమే పరిశీలిస్తామని, గీతంలోని సాహిత్యంపై లేదా దాని అధికారిక హోదాపై ఎటువంటి తీర్పు ఇవ్వబోమని న్యాయస్థానం వెల్లడించింది.









