AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అన్నమయ్య జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా.. 20 మందికి తీవ్ర గాయాలు..

అన్నమయ్య జిల్లాలో ఉదయాన్నే ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు టైరు ఒక్కసారిగా పంక్చర్ కావడంతో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం.. మదనపల్లె ఆర్టీసీ డిపోకు చెందిన నాన్‌స్టాప్‌ బస్సు మంగళవారం ఉదయం ప్రయాణికులతో తిరుపతికి బయల్దేరింది. మదనపల్లె-తిరుపతి జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా, వాల్మీకిపురం మండలం విఠలం గ్రామం సమీపంలోకి రాగానే బస్సు టైరు ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు రోడ్డు పక్కనే ఉన్న కల్వర్టులోకి దూసుకెళ్లి బోల్తాపడింది.

ప్రమాదం జరగగానే స్థానికులు వెంటనే స్పందించి బాధితులను బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన 20 మంది ప్రయాణికులను వెంటనే 108 వాహనాల్లో వాల్మీకిపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన అనంతరం, వారిలో పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉన్న కొందరిని మెరుగైన వైద్యం కోసం మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న ఎస్సై తిప్పేస్వామి సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

ANN TOP 10