AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దీదీకి దెబ్బ మీద దెబ్బ.. నందిగ్రామ్ తర్వాత రెజీనగర్‌లోనూ షాక్..!

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీకి రాజకీయంగా అస్సలు కలసిరావడం లేదు. ఉపఎన్నికల బరి నుంచి ఆమె మద్దతుదారులు వరుసగా తప్పుకుంటూ షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. శుక్రవారం నందిగ్రామ్ అభ్యర్థి తన నామినేషన్‌ను ఉపసంహరించుకోగా.. ఇవాళ రెజీనగర్ ఉపఎన్నిక బరిలో నిలిచిన అభ్యర్థి కూడా అదే బాట పట్టారు. దీంతో రెండు కీలక స్థానాల్లోనూ దీదీ వర్గానికి అభ్యర్థులు లేకుండా పోయారు.

రెజీనగర్ ఉపఎన్నిక రేసు నుంచి తప్పుకున్నట్లు మమతా బెనర్జీ వర్గం అభ్యర్థి రబివుల్ ఆలమ్ చౌదరి (Rabiul Alam Chowdhury) అధికారికంగా ప్రకటించారు. రాష్ట్ర యంత్రాంగం తమ పార్టీ శ్రేణులను తీవ్రంగా వేధింపులకు గురిచేస్తోందని ఆ ఒత్తిడి తట్టుకోలేకే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన విలేకరులకు తెలిపారు. ‘ప్రస్తుతం మా పార్టీకి అధికారిక గుర్తు కూడా లేదు. కార్యకర్తలను అనేక రకాలుగా వేధిస్తున్నారు. దాంతో చాలామంది పనుల కోసం ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎవరిని పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయాలి? యంత్రాంగం నుంచి వస్తున్న ఒత్తిడి దృష్ట్యా బరిలో ఉండలేమని కార్యకర్తలు స్పష్టం చేశారు. అందుకే నామినేషన్ ఉపసంహరించుకున్నా’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అంతకుముందు శుక్రవారం నందిగ్రామ్ బరి నుంచి మమతా బెనర్జీ వర్గం అభ్యర్థి సంచిత ప్రధాన్ డే తప్పుకున్నారు. ముఖ్యమంత్రి సువేందు అధికారితో భేటీ అయిన అనంతరమే ఆమె తన నామినేషన్‌ను వెనక్కి తీసుకోవడం గమనార్హం. సొంత అభ్యర్థి తప్పుకోవడంతో మమత వెంటనే చాకచక్యంగా వ్యవహరించి కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఆ వ్యూహం కూడా పారలేదు. మమత మద్దతు ప్రకటించిన కొద్ది గంటల్లోనే 2007 నాటి ఒక పాత హత్య కేసులో కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో రెండు చోట్ల మమతకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాగా, ఈ రెండు స్థానాలకు అక్టోబర్ 6న పోలింగ్ జరగనుంది.

మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పేరు, గుర్తుపై మమతా బెనర్జీ, రితబ్రతా బెనర్జీ వర్గాల మధ్య తీవ్ర వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం గురువారం సంచలన నిర్ణయం తీసుకుంది. రెండు వర్గాల్లో ఏ ఒక్కరూ ‘తృణమూల్ కాంగ్రెస్’ పేరును గానీ, దాని గుర్తును గానీ ఈ ఉపఎన్నికల్లో వాడకూడదని స్పష్టం చేస్తూ వాటిని ఫ్రీజ్ చేసింది. ఈ క్రమంలో ఈసీ తాత్కాలికంగా ఇరు వర్గాలకు కొత్త పేర్లు, గుర్తులను కేటాయించింది. మమతా బెనర్జీ వర్గానికి ‘మమతా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్’ అని పేరు పెట్టి ‘ఫుట్‌బాల్ ప్లేయర్’ గుర్తును ఇచ్చింది. ఇక అరూప్ రాయ్, రితబ్రతా బెనర్జీల నాయకత్వంలోని రెబల్ గ్రూపునకు ‘డెమోక్రటిక్ తృణమూల్ కాంగ్రెస్’ అని పేరు కేటాయించి ‘ఉత్తరాల కవర్’ గుర్తును కేటాయించింది.

అయితే పార్టీ పేరు, గుర్తును తాత్కాలికంగా ఫ్రీజ్ చేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ మమతా బెనర్జీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఒకవైపు ఈ న్యాయపోరాటం కొనసాగుతుండగానే.. మరోవైపు ఉపఎన్నికల బరి నుంచి అభ్యర్థులు ఒకరి తర్వాత ఒకరు తప్పుకుంటూ ఉండటంతో దీదీ తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

ANN TOP 10