వైసీపీ నేతలకు కష్టాలు వీడడం లేదు. కీలక నేతలకు నెలకు ఒకరికి చొప్పున నోటీసులు వస్తున్నాయి. తాజాగా ఇప్పుడు మాజీ మంత్రి రోజా వంతైంది. ఈ నెల 30న విచారణకు రావాలని తిరుపతి పోలీసులు నోటీసులు ఇచ్చారు. నోటీసుల విషయం తెలియగానే వైసీపీలో కాస్త అలజడి మొదలైంది.
వైసీపీ నేతలకు కష్టాలు- రోజాకు పోలీసులు నోటీసులు- వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజాకు తిరుపతి తూర్పు పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు ఈనెల 30న తమ ఎదుట హాజరు కావాలని అందులో ప్రస్తావించారు. వైసీపీ అధినేత జగన్‌తోపాటు, ఆ పార్టీ నేతల కుటుంబాల మహిళలను కించపరిచేలా ఓ దిన పత్రికలో అవాస్తవ కథనాలు ప్రచురించారన్నది ఆ పార్టీ వెర్షన్. దీనికి నిరసనగా ఆ పత్రిక ప్రతులను దహనం చేశారు ఆమె. దీనిపై తిరుపతి తూర్పు పీఎస్‌లో రోజాతోపాటు ఆమె అనుచరులపై కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమెకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.
బెదిరింపులకు భయపడేది లేదు-రోజా- నోటీసుల వ్యవహారంపై మాజీ మంత్రి ఏమన్నారు? నోటీసుల తర్వాత తన వాయిస్ వినిపించారు రోజా. తనపై రాజకీయ కక్షసాధింపు చర్యలకు కూటమి ప్రభుత్వం పాల్పడుతోందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, మహిళలకు, చిన్నారులకు రక్షణ కరువైందన్నారు. శాంతిభద్రతలు, మహిళల భద్రతను ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడ్డారు.
రెడ్ బుక్ రాజ్యాంగం-పేపర్లు దహనం చేసినందుకు తమకు నోటీసులు ఇవ్వడం ఏంటని తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఇది ముమ్మాటికీ పక్షపాత వైఖరికి నిదర్శనమన్నారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించేవారి గొంతు నొక్కేందుకే కక్షపూరిత కేసులు పెడుతున్నారని ఘాటు విమర్శలు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, ఇలాంటి బెదిరింపులకు ఎవరూ భయపడరని అన్నారు.
తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని, తమపై బనాయించిన అక్రమ కేసులను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని అణిచివేయాలని చూడటం సరైన పద్ధతి కాదని హితవు పలికారు మాజీ మంత్రి రోజా. ఇలా చీటికి మాటికీ వైసీపీ నేతలపై కేసులు నమోదుకావడంతో ఆ పార్టీ కేడర్‌లో నిరుత్సాహం మొదలైనట్టు తెలుస్తోంది.








