నీట్-యూజీ 2026 పేపర్ లీక్ వ్యవహారంలో మొదలైన విద్యార్థుల నిరసన, అనతికాలంలోనే పెను ఉద్యమంగా మారి అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. విద్యార్థులపై లాఠీఛార్జ్, బాష్పవాయువు ప్రయోగం, ఢిల్లీ వీధుల్లో వేలాది మంది యువత చేపట్టిన నిరసనల చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసారమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయడంతో, ఈ ఆందోళనలను భారత పాలన, యువత ఆకాంక్షలు, రాజకీయ జవాబుదారీతనానికి సంబంధించినవిగా అంతర్జాతీయ మీడియా అభివర్ణించింది.
ప్రపంచ మీడియా సంస్థల కథనాల్లో ఏముంది?
రాయిటర్స్: ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చాక ఎదుర్కొంటున్న అతిపెద్ద రాజకీయ సవాల్ ఇదేనని రాయిటర్స్ పేర్కొంది. సాధారణంగా ప్రజా ఒత్తిళ్లకు తలొగ్గరనే పేరున్న మోదీ ప్రభుత్వంలో, మంత్రి రాజీనామా చేయడం ఆశ్చర్యకరమని విశ్లేషించింది. పరీక్షల్లో అవకతవకలతో పాటు, నిరుద్యోగం, పరిమిత అవకాశాలపై యువతలో ఉన్న ఆందోళనను ఈ నిరసనలు ప్రతిబింబిస్తున్నాయని తెలిపింది.
సీఎన్ఎన్: ప్రధాన్ రాజీనామాను మోదీ ప్రభుత్వానికి “అరుదైన, పెరుగుతున్న సవాల్”గా సీఎన్ఎన్ అభివర్ణించింది. ఈ ఆందోళనలు కేవలం పరీక్షల లీక్‌కు మాత్రమే పరిమితం కాలేదని, దేశంలో యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య, పాలనలో జవాబుదారీతనంపై ఉన్న లోతైన ఆందోళనలకు ఇది నిదర్శనమని పేర్కొంది.
బీబీసీ: ఇటీవలి కాలంలో భారత్‌లో జరిగిన అతిపెద్ద విద్యార్థి ఉద్యమాలలో ఇది ఒకటని బీబీసీ తెలిపింది. 1970ల నాటి నవ నిర్మాణ్ ఉద్యమంతో పోలుస్తూ, కొన్ని విద్యార్థి ఉద్యమాలు రాజకీయ మార్పులకు కారణమైనప్పటికీ, మరికొన్ని కాలక్రమేణా కనుమరుగయ్యాయని గుర్తుచేసింది. “ఈ అసంతృప్తిని రాజకీయ ఉద్యమంగా ఎంతకాలం కొనసాగించగలరనేది మరో ప్రశ్న” అని వ్యాఖ్యానించింది.
ది గార్డియన్: ఈ పత్రిక రాజకీయ కోణంలో కాకుండా, సాంస్కృతిక స్పందనపై దృష్టి పెట్టింది. విద్యార్థులపై హింస జరుగుతున్నా భారత సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు మౌనంగా ఉండటంపై నిరసనకారుల్లో వ్యక్తమైన ఆగ్రహాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. సొంత దేశంలో యువత కష్టాల్లో ఉన్నప్పుడు స్పందించని సెలబ్రిటీల తీరును నిరసనకారులు తప్పుపట్టినట్లు కథనంలో పేర్కొంది.
అల్ జజీరా, ఎస్‌సీఎంపీ: మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటీవలి కాలంలో ఇంత స్పష్టమైన ప్రజా వ్యతిరేకత కనిపించడం ఇదేనని అల్ జజీరా తెలిపింది. ఈ ఉద్యమం యూనివర్సిటీ క్యాంపస్‌లకే పరిమితం కాకుండా, పౌర సమాజం, ప్రతిపక్షాల మద్దతుతో దేశవ్యాప్తంగా విస్తరించిందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ విశ్లేషించింది.
మొత్తం మీద, ఒక్కో మీడియా సంస్థ ఒక్కో కోణంలో విశ్లేషించినప్పటికీ, ఈ ఉద్యమ తీవ్రతను, ప్రాధాన్యతను అన్నీ గుర్తించాయి. కేవలం పరీక్షల్లో అవకతవకల అంశంగా మొదలైన ఈ నిరసన, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నాటికి.. యువత భవిష్యత్తు, అవకాశాలు, పాలనపై వారికున్న విస్తృత అసంతృప్తికి ప్రతీకగా మారిందని అంతర్జాతీయ మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి.








