ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు నేతల ఐక్యత, వారి భేటీలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. అయితే ఇటీవల జరిగిన ఒక సంతాప సభ ఇప్పుడు తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య కొత్త రాజకీయ మంటలు రాజేసింది. ముద్రగడ కుటుంబంలో జరిగిన సంతాప సభకు హాజరై తన పక్కన కూర్చున్నారనే కారణంతో టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమకు నోటీసులు ఇవ్వడాన్ని మాజీ మంత్రి, వైసిపి నేత అంబటి రాంబాబు తీవ్రంగా తప్పుపట్టారు.
కాపులు ఒకటైతే చంద్రబాబుకు భయం..
కాపులందరూ ఒకే వేదికపైకి వచ్చి కలిసికట్టుగా నిలబడితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎక్కడ లేని కడుపుమంట వస్తోందని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే అని కూడా చూడకుండా, కేవలం కాపు నేతలతో కలిసి కూర్చున్నందుకే బొండా ఉమకు షోకాజ్ నోటీసు జారీ చేయడం ఆయన వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు.
సంతాప సభల్లోనూ రాజకీయాలా?
‘కాపుల్లో అలజడి మొదలైంది’ అని బొండా ఉమ అన్న మాటలపై టిడిపికి ఏవైనా అభ్యంతరాలు లేదా ఆక్షేపణలు ఉంటే ఉండవచ్చని, కానీ అసలు సంతాప సభకే వెళ్ల వద్దనడం ఎంతవరకు న్యాయమని అంబటి నిలదీశారు. కాపుల పక్కన కూర్చోవద్దని ఆంక్షలు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. బాధలో ఉన్న వారిని పరామర్శించేందుకు నిర్వహించిన సభకు అన్ని పార్టీల నాయకులు వస్తారని, అక్కడ పాల్గొంటే వచ్చిన తప్పేమిటని ప్రశ్నించారు. రాజకీయాలకు అతీతంగా ఉండే ఇలాంటి కార్యక్రమాలను కూడా వివాదాస్పదం చేయడం సరికాదని ఆయన హితవు పలికారు.









