AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ రైతులకు షాకింగ్ న్యూస్..! ఆగిపోనున్న ఆ పథకం..!

ఏదైనా ప్రమాదం జరిగినా, అకాల మరణం సంభవించినా గుండె పగిలిన రైతు కుటుంబానికి ఆర్థిక కొండంత అండగా నిలిచే ‘రైతు బీమా’ పథకానికి గ్రహణం పట్టుకుంది. పథకం పునరుద్ధరణ (రెన్యూవల్) గడువు సమీపిస్తున్నా ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి కదలిక లేకపోవడంతో రాష్ట్రంలోని లక్షలాది మంది అన్నదాతల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రతి ఏటా ఆగస్టు మధ్య నాటికి పూర్తవ్వాల్సిన ఈ ప్రక్రియ ఈసారి అసలు మొదలే కాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రతి ఏటా అత్యంత ప్రాధాన్యతతో నిర్వహించే బీమా రెన్యూవల్ ప్రక్రియ ఈసారి అసలు ఊసే లేకుండా పోయింది.

 

ఆగస్టు 14తో ముగియనున్న ప్రీమియం!

ప్రస్తుత రైతు బీమా పాలసీ గడువు ఆగస్టు 14 అర్ధరాత్రితో ముగియనుంది. నిబంధనల ప్రకారం.. ఆగస్టు 15 నుంచి కొత్త ఏడాదితో బీమా రక్షణ ప్రారంభం కావాల్సి ఉంది. అందుకోసం ఈపాటికే వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయిలో సర్వే పూర్తి చేసి, అర్హులైన కొత్త రైతుల వివరాలను సేకరించి, పాత వారితో కలిపి ఎల్‌ఐసీ కి జాబితాలు పంపించాల్సింది. అయితే, ఇప్పటివరకు ప్రీమియం చెల్లింపులు, రెన్యూవల్ ప్రక్రియపై ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు జారీ కాలేదని సమాచారం.

 

ఖజానాలో నిధుల ‘కటకట’?

 

పథకాన్ని కొనసాగించాలంటే ప్రభుత్వం తక్షణమే ఎల్‌ఐసీకి ప్రీమియం బకాయిలతో పాటు కొత్త ఏడాదికి సంబంధించిన నిధులను జమ చేయాల్సి ఉంది. సమారు రాష్ట్రంలో 42.16 లక్షల మంది రైతులు ఉన్నట్లు సమాచారం. వీరందరికి ప్రీమియం కోసం ప్రభుత్వానికి కనీసం రూ.1,500 కోట్లకు పైగా నిధులు తక్షణమే అవసరమవుతాయి. ఖజానాలో నెలకొన్న తీవ్ర ఆర్థిక ఇబ్బందుల వల్లే ప్రభుత్వం దీనిపై ముందడుగు వేయలేకపోతోందని ప్రచారం జరుగుతుంది.

 

అన్నదాతకు రక్షణ ఏది?.. మరణిస్తే దిక్కెవరు?

 

ఆగస్టు 14 లోగా ప్రభుత్వం ఎల్‌ఐసీకి ప్రీమియం నిధులు చెల్లించకపోతే, ఆగస్టు 15 నుంచి పాలసీ రద్దవుతుంది. ఏ కారణంతోనైనా రైతు మరణిస్తే, ఆ కుటుంబానికి అందాల్సిన రూ. 5 లక్షల బీమా పరిపరిహారం నిలిచిపోతుంది. ‘అసలే అప్పుల బాధల్లో ఉన్న తమకు ఈ పరిపరిహారమే ఏకైక ధీమా అని, అది కూడా అందకపోతే తమ పరిస్థితి ఏమిటి?’ అని రైతు కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి.

 

గత ఏడాది 42.16 లక్షల మంది రైతులు ఎన్ రోల్

ఏ కారణంతో రైతు చనిపోయినా 10 రోజుల్లోనే రూ.5 లక్షల పరిహారం నేరుగా నామినీ ఖాతాలో జమ కావడం రైతు బీమా ప్రత్యేకత. దీంతో రాష్ట్రంలోని 42.16 లక్షల కుటుంబాలకు ఇది పెద్ద దిక్కుగా మారింది. గతంలో ఏటా జూలై నెలలోనే సర్వేలు, కొత్త రైతుల నమోదు ప్రక్రియ హడావుడిగా సాగేది. కానీ, ఈసారి జూలై చివరివారం వచ్చినా గ్రామాల్లో వ్యవసాయ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో పథకం భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే గడువు ముగిసేందుకు కొద్ది రోజులే ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి నిధులు విడుదల చేయాలని, ఆగస్టు 14 లోపు రెన్యూవల్ పూర్తి చేసి అన్నదాతలకు భరోసా కల్పించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ANN TOP 10