AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

10 ఏళ్లలో 152 పేపర్‌ లీక్‌లు.. ఒక్కరికీ శిక్ష లేదు: రాహుల్‌..

నీట్‌ ప్రశ్నపత్రాల లీక్‌ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశ విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని, దీనివల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. గత పదేళ్లలో 152 ప్రశ్నపత్రాల లీక్‌లు జరిగాయని, దీంతో 7.5 కోట్ల మంది విద్యార్థులు, వారి కుటుంబాలు ప్రభావితమయ్యాయని తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఒక్కరికీ శిక్ష పడలేదని విమర్శించారు.

 

ఢిల్లీలోని కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రాహుల్‌, ప్రశ్నపత్రాల లీక్‌లపై నిరసన తెలుపుతున్న విద్యార్థుల డిమాండ్లు పూర్తిగా సమంజసమైనవేనన్నారు. వారి గొంతు నొక్కేందుకు ప్రభుత్వం బలప్రయోగానికి దిగుతోందని ఆరోపించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అవినీతిపరుడు, అసమర్థుడని విమర్శిస్తూ ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

 

ఈ సందర్భంగా రాహుల్‌ మూడు ప్రధాన డిమాండ్లను కేంద్రం ముందు ఉంచారు. ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించాలని, నీట్‌ పరీక్షల్లో జరిగిన అవకతవకల బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ మొత్తం వ్యవహారంపై ప్రధానమంత్రి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు.

 

విద్యార్థులు కష్టపడి చదివి, కుటుంబాలు రూ.లక్షలు ఖర్చు చేసినా ప్రశ్నపత్రాల లీక్‌ల కారణంగా వారి భవిష్యత్తు దెబ్బతింటోందని రాహుల్‌ అన్నారు. ఈ పరిస్థితుల్లో సాధారణ కుటుంబాలకు చెందిన విద్యార్థులు నష్టపోతుండగా, ప్రత్యేక అవకాశాలు ఉన్నవారికే ప్రయోజనం చేకూరుతోందని ఆరోపించారు.

ANN TOP 10