గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న చిత్రం ‘ఆర్‌సీ17’ (వర్కింగ్ టైటిల్)పై సినీ వర్గాల్లో అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘రంగస్థలం’ ఇండస్ట్రీ హిట్‌గా నిలవడం, ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ ఫ్రాంచైజీ సినిమాలు చరిత్ర సృష్టించడం నేపథ్యంలో… ఈ కొత్త ప్రాజెక్ట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు తుది దశకు చేరుకున్న ఈ సినిమాని త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. మొదట కియారా అద్వానీ పేరు వినిపించినా, తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న పేరు బలంగా వినిపిస్తోంది.
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ సిరీస్‌తో రష్మిక పాన్-ఇండియా స్థాయిలో స్టార్‌డమ్ సంపాదించుకుంది. ఆ చిత్రంలో ఆమె నటనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ‘ఆర్‌సీ17’ కోసం సుకుమార్ ఒక బలమైన, కథను మలుపు తిప్పే మహిళా పాత్రను రాసుకున్నారని, ఆ పాత్రకు రష్మిక అయితేనే పూర్తి న్యాయం చేయగలదని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఆమెకున్న పాన్-ఇండియా ఇమేజ్ కూడా సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తుందని చిత్రబృందం అంచనా వేస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కేవలం గ్లామర్ కోసమే కాకుండా కథాగమనంలో అత్యంత కీలకంగా ఉండనుందని తెలుస్తోంది.
చరణ్ మాస్ ఇమేజ్, సుకుమార్ టేకింగ్, దానికి రష్మిక నటన తోడైతే బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్ర ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ‘రంగస్థలం’తో రికార్డులు సృష్టించిన ఈ కాంబో, మరోసారి అంతకుమించిన విజయాన్ని అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. అయితే, హీరోయిన్ ఎంపికపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
మరోవైపు రష్మిక ప్రస్తుతం తన భర్త విజయ్ దేవరకొండతో కలిసి ‘రణబాలి’ అనే భారీ పీరియాడిక్ యాక్షన్ చిత్రంలో నటిస్తోంది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం, 19వ శతాబ్దంలో రాయలసీమలో కరవు సమయంలో బ్రిటిష్ పాలనపై పోరాడిన ఓ యోధుడి కథ ఆధారంగా తెరకెక్కుతోంది. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ తర్వాత విజయ్-రష్మిక కాంబోలో వస్తున్న మూడో సినిమా కావడంతో దీనిపై కూడా భారీ అంచనాలున్నాయి.








