రాష్ట్రంలో సన్న వడ్ల కొనుగోళ్లపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ఇందులో ఎలాంటి కుంభకోణం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మీడియా , సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చిచెప్పారు. కొందరు రాజకీయ లబ్ధి కోసమే కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్ పాలనలో ప్రతీ వ్యవహారం పారదర్శకంగా జరుగుతోందని ఆయన తెలిపారు.
సన్న వడ్ల కొనుగోళ్లపై క్లారిటీ
సన్న వడ్ల టెండర్ల విషయంలో కొందరు చేస్తున్న ఆరోపణలను మంత్రి తీవ్రంగా ఖండించారు. మొదట టెండర్ పిలిచినప్పుడు ధరలు పెంచి కోట్ చేయడంతో ఎవరూ ముందుకు రాలేదని, అందుకే నిబంధనల ప్రకారమే మళ్లీ కొత్తగా టెండర్లు పిలవాల్సి వచ్చిందని ఆయన వివరించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలోనే అనేక కుంభకోణాలు జరిగాయని, తమ ప్రభుత్వంలో ప్రతీ పైసా ప్రజాధనాన్ని ఎంతో జాగ్రత్తగా పారదర్శకంగా ఉపయోగిస్తున్నామని అన్నారు.
హరీష్ రావు వ్యాఖ్యలపై తీవ్ర ధ్వజం
మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నవన్నీ పచ్చి అబద్ధాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. హరీష్ రావు నిజంగానే నీటిపారుదల శాఖలో అంతటి గొప్ప ఎక్స్‌పర్ట్ అయితే, గతంలో కేసీఆర్ ఆయనను ఆ పదవి నుంచి ఎందుకు తొలగించారో సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. ముందుగా కవిత అడుగుతున్న ప్రశ్నలకు హరీష్ రావు జవాబు చెప్పాలని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా, రూ. 1400 కోట్ల వ్యవహారంలో హరీష్ రావు అసలు నిజాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
సాగునీటి ప్రాజెక్టుల పురోగతి
మరోవైపు దేవాదుల ప్రాజెక్టు పనులపై స్పందిస్తూ.. ప్రస్తుతం అక్కడ 7 పంపులు నిరంతరాయంగా నడుస్తున్నాయని మంత్రి తెలిపారు. రైతుల ప్రయోజనాలే ధ్యేయంగా పనిచేస్తున్నామని, ఈ రోజే మరో రెండు పంపులను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. విపక్షాలు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా, కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకమైన పాలన అందిస్తుందని పునరుద్ఘాటించారు.








