దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయ్ కృష్ణారెడ్డి సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం, ఆ తర్వాత ఆయన రాశారని చెబుతున్న ఒక లేఖ వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపుతోంది. తమ మధ్య ఉన్నది ఏకపక్ష వేధింపులు కావని, అది పరస్పర అంగీకారంతో కూడిన సంబంధమని… తామిద్దరం ఏడాదిగా రిలేషన్ షిప్ లో ఉన్నామని ఆయన ఆ నోట్‌లో పేర్కొనడంతో కేసు కొత్త మలుపు తిరిగింది.
వివరాల్లోకి వెళితే, హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (SVPNPA)లో శిక్షణ పొందుతున్న ఉదయ్ కృష్ణారెడ్డి సోమవారం ఉదయం ఎర్రగడ్డ మోతీ నగర్‌లోని బంధువుల నివాసంలో అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. కుటుంబసభ్యులు వెంటనే ఆయన్ను ఎస్ఆర్ నగర్‌లోని జయంతి ఆసుపత్రికి తరలించారు. ఆయన శానిటైజర్ సేవించి ఆత్మహత్యకు యత్నించారని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.
అంతకుముందు, ఉదయ్ కృష్ణారెడ్డిపై కర్ణాటకకు చెందిన 30 ఏళ్ల వివాహిత, సహ ట్రైనీ ఐపీఎస్ అధికారిణి అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జూన్ 23 నుంచి జూలై 10 మధ్య కాలంలో ఉదయ్ కృష్ణారెడ్డి తనను లైంగికంగా వేధించారని, అసభ్యకర వాట్సాప్ సందేశాలు పంపారని ఆరోపించారు. జూలై 9న తనపై భౌతికంగా దాడి చేసి, జుట్టు పట్టుకుని లాగి, గొంతు నులిమి, కత్తితో బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ ప్రైవేట్ వీడియోను తన భర్తకు పంపి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని కూడా ఆమె ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిపై లైంగిక వేధింపులు, దాడి, క్రిమినల్ బెదిరింపులతో పాటు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఆరోపణలపై జాతీయ పోలీస్ అకాడమీ అంతర్గత విచారణ జరిపి, సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన అనంతరం ఉదయ్‌ను అకాడమీ నుంచి తాత్కాలికంగా పంపించివేసినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఉదయ్ కృష్ణారెడ్డి రాశారని చెబుతున్న లేఖ వెలుగులోకి వచ్చింది. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, తమ మధ్య ఏడాదిగా రిలేషన్ షిప్ ఉందని ఆయన ఆ నోట్‌లో పేర్కొన్నారు. ఆమెకు వివాహం అయిన తర్వాత కూడా సంబంధం కొనసాగిందని, ఆమె తన గదికి వచ్చిన వీడియో ఆధారాలు తన మొబైల్ ఫోన్‌లో ఉన్నాయని తెలిపారు. ఈ విషయం గురించి తాను ఆమె భర్తకు కూడా తెలియజేశానని వెల్లడించారు. ఆమే తన గదికి వచ్చి తలుపు తెరవాలని బెదిరించిందని ఉదయ్ కృష్ణారెడ్డి వివరించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి, చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి నాయనమ్మ సంరక్షణలో పెరిగారు. 2013లో కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరి, ఐదో ప్రయత్నంలో సివిల్స్‌లో 350వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ఆయన స్ఫూర్తిదాయక ప్రయాణం అందరి ప్రశంసలు పొందింది. మహిళా అధికారిణి ఫిర్యాదు, ఉదయ్ కృష్ణారెడ్డి లేఖలోని అంశాలపై పోలీసులు రెండు కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు








